హైడ్రాక్సీక్లోరోక్విన్‌పై అమెరికా కీలక ప్రకటన
By సుభాష్ Published on 25 April 2020 1:17 PM ISTమలేరియాకు సంబంధించిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ (ఎఫ్‌డీఏ) సంచలన ప్రకటన చేసింది. కరోనా రోగులకు ఈ ఔషధం ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనా వైరస్‌ను హైడ్రాక్సీ క్లోరోక్విన్ నియంత్రిస్తుందని దానిపై సరైన జవాబు చెప్పలేమని అభిప్రాయపడింది. దానిపై సరైన ప్రయోగం జరగలేదని, దీనిని ఎక్కువగా వాడినట్లయితే ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని ఎఫ్‌డీఏ తెలిపింది. దీని వల్ల గుండెకు సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
అమెరికాలో కరోనా వైరస్ సోకిన వారికి అత్యవసర పరిస్థితుల్లోనే ఈ మెడిసిన్‌ను వాడాలని ఆదేశించామని, అది కూడా కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులే అతనికి ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వాడాలని సూచించారు.
కాగా, కరోనా సోకిన వారికి ఈ మలేరియా నియంత్రణకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వాడవచ్చని భారత వైద్య పరిశోధన మండలి అనుమతి ఇచ్చింది. అందుకు ఈ మెడిసన్‌ను సరఫరా చేయాలని అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు సైతం భారత్‌ను కోరాయి. దీనికి ఎఫ్‌డీఏ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఈ మందులను సరఫరా చేసింది భారత్.
అయితే కరోనా వైరస్‌ను నియంత్రించే శక్తి ఈ మెడిసిన్‌లో ఉందని ఇంత వరకూ ఎవరు కూడా ధృవీకరించలేదు. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కరోనా సోకన వారికి ఇదే మందును ఉపయోగిస్తున్నారు.