హైదరాబాద్‌లోని పెట్రోల్ పంపు వద్ద.. తుపాకీతో యువకుల హల్‌చల్‌.. వీడియో

Youth creates ruckus with 'gun' at Hyderabad petrol pump. పెట్రోల్‌ డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లించే విషయమై ఉద్యోగితో వాగ్వాదానికి దిగిన ఓ యువకుడు సోమవారం హైదరాబాద్‌లోని

By అంజి  Published on  18 Oct 2022 5:33 AM GMT
హైదరాబాద్‌లోని పెట్రోల్ పంపు వద్ద.. తుపాకీతో యువకుల హల్‌చల్‌.. వీడియో

పెట్రోల్‌ డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లించే విషయమై ఉద్యోగితో వాగ్వాదానికి దిగిన ఓ యువకుడు సోమవారం హైదరాబాద్‌లోని ఓ పెట్రోల్ పంపులో తుపాకీతో రచ్చ సృష్టించాడు. అతను మరో ఇద్దరితో కలిసి పెట్రోల్‌ పంపు కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశాడు. పాతబస్తీలోని బహదూర్‌పురా ప్రాంతంలోని ఇండియన్‌ ఆయిల్‌ పంపులో ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడు చేతిలో ఆయుధం పట్టుకుని ద్విచక్ర వాహనాలపై ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యువకుడు తన మోటార్‌బైక్‌లో 500 రూపాయల పెట్రోల్‌ పోయించుకుని, యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించే సమయంలో ఈ సంఘటన జరిగింది. ట్రాన్సాక్షన్‌ విఫలమవడంతో పెట్రోల్ బంక్ వద్ద ఉన్న కార్మికుడు నగదు చెల్లించాలని పట్టుబట్టాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే యువకుడు తన ఇద్దరు స్నేహితులను పెట్రోల్‌ పంపు వద్దకు పిలిచాడు. కార్యాలయాన్ని ధ్వంసం చేసి క్యాషియర్‌పై దాడి చేశారు. వారిలో ఒకరు తుపాకీని తీసుకుని బంక్ ఉద్యోగులు, కస్టమర్లలో భయాందోళనలు రేకెత్తించారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాడి చేసిన వారిలో ఇద్దరు తప్పించుకోగా, మూడో వ్యక్తిని ఉద్యోగులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిని ఇఫ్తికార్‌గా గుర్తించారు. అతనికి గాయాలు కావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు దుండగుల కోసం గాలిస్తున్నారు.


Next Story