తప్పుడు వార్తలు ప్రజాస్వామ్యానికి ముప్పు
Workshop held on 'Countering Disinformation for Telugu TV Reporters'.తప్పుడు సమాచారంతో కూడిన వార్తలు ప్రజాస్వామ్య
By తోట వంశీ కుమార్ Published on 9 Aug 2022 2:27 AM GMTతప్పుడు సమాచారంతో కూడిన వార్తలు ప్రజాస్వామ్య పునాదులను పెకిలిస్తాయని యూఎస్ కాన్సులేట్ జనరల్ అసిస్టెంట్ పబ్లిక్ అఫైర్స్ అధికారి ఫ్రంకీ స్టర్మ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం, యూఎస్ కాన్యులేట్ జనరల్ ఆధ్వర్యంలో 'కౌంటరింగ్ డిస్‌ఇన్ఫర్మేషన్ ఫర్ తెలుగు టీవీ రిపోర్టర్స్' అనే అంశంపై రెండు రోజులు వర్క్ షాప్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉంటూ సత్యాన్ని రక్షించుకోవడం పౌరుల విధి,బాధ్యత అని అన్నారు. వార్తల ప్రసారానికి ముందు వాస్తవాలను నిర్థారణ చేసుకోవాలని సూచించారు. తప్పుడు సమాచారాన్ని కట్టిడి చేయటంతో పాటు వాస్తవాలను ప్రజలకు అందించేందుకు జర్నలిస్టులు అదనపు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు. నకిలీ వార్తలు, తప్పుడు సమాచార వ్యాప్తి పై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తప్పుడు సమాచారం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని, వాస్తవ సమాచారంపై ప్రాథమిక అవగాహన ఉంటేనే తప్పుడు సమాచారాన్ని తిప్పిగొట్టగలమన్నారు. ఈ అంశంలో ఉస్మానియా యూనివర్సిటీ కృషి చేస్తున్నదని, ఇప్పటికే 100 గంటలపాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించిందని గుర్తుచేశారు. ఇలాంటి శిక్షణా తరగతులు మరిన్ని జరగాల్సిన ఆవశ్యకతను ఉందన్నారు.
వందరోజుల శిక్షణ ద్వారా నేర్చుకునే మెలుకువలతో తెలుగు జర్నలిస్టులు ఇప్పటికే ఫలితాలు రాబడుతున్నారని ఉస్మానియా జర్నలిజం విభాధిపతి ప్రొఫెసర్ స్టీవెన్ సన్ కోహిర్ తెలిపారు. శిక్షణ పొందిన జర్నలిస్టుల్లో పలువురు ఇప్పటికే తప్పుడు, నకిలీ వార్తలను గుర్తించి అడ్డుకోగలిగారని గుర్తు చేశారు. జర్నలిస్టుల నుంచి సైతం ఈ కోర్సుకు అనూహ్య స్పందన వచ్చిందని అన్నారు. వార్తలలో వాస్తవ నిర్ధారణ అనే అంశంపై ఫ్యాక్ట్‌చెకర్స్ ఉడుముల సుధాకర్‌రెడ్డి, బీఎస్ సత్యప్రియ తెలుగులో అందించిన సమాచారం, మెళకువలు జర్నలిస్టులకు ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు.
ఈ అంశంలో టెక్సాస్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ అనంత సుధాకర్ బొబ్బిలి తమ అంతర్జాతీయ నైపుణ్యం, అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో యూస్ కాన్సులేట్ మీడియా అడ్వయిజర్ అబ్దుల్ బాసిత్, ఫ్యాక్ట్ ట్రైనర్స్ ఉడుముల సుధాకర్ రెడ్డి, కొరీనా, ప్రాజెక్టు సభ్యులు ఎస్.రాము, అబ్దుల్ బాసిత్‌లతో పాటు వివిధ చానళ్లకు చెందిన మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.