మోసపోయేవాళ్లు ఉంటే మోసగాళ్లు రెచ్చిపోతారానే సంఘటన ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. అలాంటి సంఘటన హైదరాబాద్‌లోని హయత్‌నగర్ లో చోటుచేసుకుంది. చిట్టీల పేరుతో పెద్ద మొత్తంలో వసూలు చేసి పరారైంది ఓ మహిళ. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 4.5 కోట్లకు పైగానే వసూళ్లకు పాల్పడింది. చివరకు అందరికి కుచ్చుటోపి పెట్టి అడ్రస్ లేకుండా వెళ్లిపోయింది. దీంతో బాధితులంతా న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. హయత్‌నగర్ పరిధిలోని ప్రగతినగర్‌కు చెందిన సప్పిడి పూలమ్మ కొన్నేళ్లుగా చిట్టీలు నడుపుతోంది.
స్థానికంగా సొంతం ఇల్లు ఉండడం.. అందరితో కలుపుగోలుగా ఉండడంతో ప్రగతి నగర్, ప్రియదర్శిని నగర్ కాలనీ, పీఎస్ఆర్ కాలనీలకు చెందిన పలువురు ఆమె వద్ద చిట్టీలు కట్టారు. కాగా.. చిట్టీల గడువు ముగిసిన అనంతరం ఆ డబ్బులు తానే తీసుకుని నెల నెల వడ్డీలు చెల్లిస్తానని చెప్పి పలువురి నుంచి అందినకాడికి అప్పులు చేసింది. చిట్టీలు పూరైన వారు, అప్పుల వారు డబ్బుల కోసం అడుగగా.. రేపు ఇస్తానని, ఎల్లుండి ఇస్తానంటూ కాలయాపన చేస్తూ వచ్చింది. ఇక శనివారం తన సామాగ్రి తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న బాధితులు ఆమె ఇంటికెళ్లి ఆందోళనకు దిగారు. తనకు సంబంధం లేదని ఆమె కొడుకు చెప్పడంతో.. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. సుమారు 70 మంది మోసపోయిన జాబితాలో ఉన్నారు.