హైదరాబాద్: ఈ నెల 23న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. అలాగే కౌంటింగ్ జరిగే ఈ నెల 25న కూడా వైన్స్ క్లోజ్ చేయాలని స్పష్టం చేశారు. బార్‌లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో మద్యం అమ్మకాలు ఉండవని తెలిపారు.
హైదరాబాద్‌లోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మంగళవారం జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున గౌతమ్ రావు, ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ పోటీలో ఉన్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. మద్యంతో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలాగే ఘర్షణలు.. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మద్యం దుకాణాలు తెరచుకుంటాయి.