మందుబాబుల‌కు బ్యాడ్ న్యూస్‌.. రెండు రోజుల పాటు మ‌ద్యం దుకాణాల బంద్‌

Wine shops to remain closed for 2 days in Cyberabad.రెండు రోజుల పాటు మ‌ద్యం దుకాణాలు మూత‌ప‌డ‌నున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sep 2022 2:18 AM GMT
మందుబాబుల‌కు బ్యాడ్ న్యూస్‌.. రెండు రోజుల పాటు మ‌ద్యం దుకాణాల బంద్‌

మందుబాబుల‌కు చేదువార్త‌. రెండు రోజుల పాటు మ‌ద్యం దుకాణాలు మూత‌ప‌డ‌నున్నాయి. గ‌ణేష్ నిమ‌జ్జ‌నం దృష్ట్యా మ‌ద్యం అమ్మ‌కాల‌పై పోలీసు శాఖ ఆంక్ష‌లు విధించింది. హైద‌రాబాద్, రాచ‌కొండ, సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలోని మద్యం షాపులు, కల్లు కాంపౌండ్స్‌ల‌ను రెండు రోజుల పాటు మూసి ఉంచాల‌ని ఆదేశాలు జారీచేసింది. శుక్ర‌వారం(సెప్టెంబ‌ర్ 9) ఉద‌యం 6 నుంచి ఆదివారం(సెప్టెంబ‌ర్‌11) ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు మూసి ఉంచాల‌ని ఉత్వ‌ర్వుల్లో పేర్కొంది. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపింది. ఎవ‌రైనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

మ‌హా నిమ‌జ్జ‌నానికి ఏర్పాట్లు పూర్తి

తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభ‌వంగా పూజ‌లందుకున్న విఘ్నేశ్వ‌రుడు శుక్ర‌వారం శోభాయాత్ర‌తో వీడ్కోలు తీసుకోనున్నాడు. ప్ర‌భుత్వం నిమ‌జ్జ‌న వేడ‌క‌కు ఏర్పాట్లు పూర్తి చేసింది. 35 వేల మందికి పైగా పోలీసులు, ఇత‌ర విభాగాల‌కు చెందిన 10,470 మంది సిబ్బంది నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ‌లో నిమ‌గ్నం కానున్నారు. హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో 12 కిలోమీటర్ల మేర డబుల్‌ లేయర్‌ భారీగేటతోపాటు నిరంతర పర్యవేక్షణకు కంట్రోల్‌ రూం, వాచ్‌టవర్లను ఏర్పాటు చేశారు. శోభాయాత్ర దారుల్లో సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిన‌ట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్ చెప్పారు. ఉత్సవం ప్రశాంతంగా ముగిసేలా ప్రజలందరూ సహకరించాలని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర సూచించారు.

గ్రేటర్ వ్యాప్తంగా జరిగే నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. శోభాయాత్రకు వచ్చే భక్తుల కోసం 565 ప్రత్యేక సిటీ బస్సులు అందుబాటులో ఉంచినట్లు ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ యాదగిరి తెలిపారు. శుక్ర‌వారం అర్థ‌రాత్రి 1 గంట వ‌ర‌కు మెట్రో రైలు న‌డుస్తాయ‌ని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. చివ‌రి రైలు రాత్రి 1 గంట‌కు బ‌య‌లుదేరి 2 గంట‌ల‌కు ఆఖ‌రిస్టేష‌న్‌కు చేరుకుంటున్నారు. శ‌నివారం తెల్ల‌వారుజామూన 4 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్యేక ఎంఎంటీఎస్ స‌ర్వీసులు న‌డుస్తాయ‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తెలిపింది.

శుక్ర‌వారం కావ‌డంతో ..

శుక్ర‌వారం మ‌సీదుల్లో ప్రార్థ‌న‌లు నిర్వ‌హించ‌నుండ‌డంతో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు గ‌ట్టి బందోబ‌స్తు చేప‌ట్టారు. ఓల్డ్‌సిటీ సహా హైదరాబాద్‌లోని ప‌లు సమస్యాత్మక ప్రాంతాల‌ను గుర్తించారు. ట్యాంక్‌బండ్‌కి కనెక్ట్ అయ్యే అన్ని రూట్లలోనూ, కీలక మసీదు సెంటర్లలోనూ ప్రత్యేక నిఘా పెట్టారు.

ఇదే సమయంలో హైదరాబాదీ ముస్లింలకు మత పెద్దలు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక మసీదుల్లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని జామియా నిజామియా సంస్థ నిర్వాహకులు ఫత్వా జారీ చేశారు. ఇరువర్గాల వారు పరస్పరం సహకరించుకుంటూ వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మతసామరస్యానికి ప్రతీక భాగ్యనగరం అని అన్నారు.

Next Story