హైదరాబాద్‌లో మ్యాన్‌హెళ్లకు 'సెన్సార్లు'.. వీటి పని ఇదే.!

Waterboard plans to install sensors for manholes in Hyderabad. హైదరాబాద్‌ మహానగరంలో వర్షం కురిస్తే అంతే.. రోడ్డు ఏదో, మ్యాన్‌హోల్‌ ఎక్కడుందో తెలియని పరిస్థితి. కొందరు వర్షపు నీరు వెళ్లడానికి

By అంజి  Published on  17 July 2022 6:56 AM GMT
హైదరాబాద్‌లో మ్యాన్‌హెళ్లకు సెన్సార్లు.. వీటి పని ఇదే.!

హైదరాబాద్‌ మహానగరంలో వర్షం కురిస్తే అంతే.. రోడ్డు ఏదో, మ్యాన్‌హోల్‌ ఎక్కడుందో తెలియని పరిస్థితి. కొందరు వర్షపు నీరు వెళ్లడానికి, ఇతర అవసరాల మ్యాన్‌హోళ్ల మూతలను తెరిచి.. పనిపోయాక వాటికి మళ్లీ మూతపెట్టడం మర్చిపోతారు. దీంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రేటర్‌లో మ్యాన్‌హోళ్ల నిర్వహణ కష్టతరంగా మారింది. ఎక్కడో ఒక చోట మ్యాన్‌హోళ్లు పొంగడం, భూమిలోకి కుంగిపోవడం లేదంటే.. మూతలు లేకపోవడం లాంటి సమస్యలు నిత్యం ఎదురవుతున్నాయి. సుమారు 4 వేల మంది సిబ్బంది, 150 వరకు ఎయిర్‌టెక్‌ యంత్రాలు ఉన్నప్పటికీ ఈ పరిస్థితి తప్పడం లేదు.

మ్యాన్‌ హోళ్ల విషయమై వాటర్‌ బోర్డు వినియోగదారుల ఫిర్యాదుల విభాగానికి వందల సంఖ్యలో ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. వర్షకాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. నగరం నడి బొడ్డున మొదలుకొని శివారు వరకు ఎక్కడ చూసినా.. మ్యాన్‌హోళ్ల సమస్య నిత్యకృత్యమైపోయింది. ఈ నేపథ్యంలోనే మ్యాన్‌హెళ్ల సమస్యల పరిష్కారానికి జలమండలి ప్రత్యేక టెక్నాలజీని తీసుకువచ్చే పనిలో పడింది. ప్రతిచోట మ్యాన్‌హోల్‌ నిర్వహణపై సిబ్బంది నిఘా పెట్టడం కష్టం.. దీనికి కొత్త టెక్నాలజీతో అడ్డుకట్ట వేయాలని జలమండలి భావిస్తోంది.


పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రధాన మార్గాలు

మ్యాన్‌హోళ్లకు సెన్సార్లు ఏర్పాటు చేయడానికి జలమండలి చర్యలు చేపడుతోంది. ఇందుకోసం పైలట్‌ ప్రాజెక్టు కింద కొన్ని ప్రధాన మార్గాల్లో ఉన్న మ్యాన్‌హోళ్లకు సెన్సార్లు ఏర్పాటు చేయనున్నారు. అవి సరిగ్గా పని చేస్తే.. ఇతర ప్రాంతాల్లో కూడా ఈ టెక్నాలజీని విస్తరించనున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈ సెన్సార్‌ టెక్నాలజీ సమస్యలకు చెక్‌ పెట్టాలని జలమండలి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ టెక్నాలజీ త్వరలో వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


10 వేల కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థ, 3 లక్షల మ్యాన్‌హోళ్లు..

హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా 10 వేల కిలోమీటర్లపైనే డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఈ డ్రైనేజీ కాల్వలపై 3 లక్షల వరకు మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. ప్రధాన మార్గాల్లో లక్ష వరకు మ్యాన్‌హోళ్లు ఉంటాయని అంచనా. వీటిలో 10 వేల వరకు ఎక్కువ లోతు ఉన్న మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. 211 ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్ల సమస్య తీవ్రంగా ఉంది. వర్షం పడితే చాలు మ్యాన్‌హోళ్లు పొంగి పొర్లుతున్నాయి. మొదట ఇలాంటి చోటే సెన్సార్లు ఉపయోగించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.


సెన్సార్లు ఎలా పని చేస్తాయి?

మ్యాన్‌హెల్‌ లోపల వాటర్‌ ఫ్రూప్‌ సెన్సార్లు అమరుస్తారు. దీంతో లోపల ప్రతి కదలికను ఈ సెన్సార్‌ పసిగట్టి.. మైక్రోచిప్‌ ద్వారా జలమండలి కమాండ్‌ కంట్రెల్‌ సెంటర్‌కు సమాచారం చేరవేస్తుంది. అలాగే సంబంధిత ప్రాంత జీఎం, డీజీఎం ఫోన్‌లకు సమాచారం వెళ్తుంది. వాటర్‌బోర్డు యాప్‌తో ఈ టెక్నాలజీని అనుసంధానం చేయనున్నారు. ఎవరైనా అక్రమంగా మ్యాన్‌హోల్ మూత తీసే ప్రయత్నం చేసినా, మ్యాన్‌హోల్‌ భూమి లోపలకు కుంగినా, లేదంటే పొంగినా.. సెన్సార్లు అధికారులను అలర్ట్‌ చేస్తాయి. వెంటనే సిబ్బంది రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటారు.

''మొదటగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ టెక్నాలజీని ప్రవేశ పెట్టి పరిశీలించాలని నిర్ణయించాం'' అని జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు.

Next Story
Share it