పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ (VHP) సభ్యులు హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని అదుపు చేయడంలో విఫలమైనందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. VHP సభ్యులు ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. కొన్ని రోజుల క్రితం పార్లమెంటులో వక్ఫ్ (సవరణ) బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లను అదుపు చేయడంలో చర్యలు తీసుకోకపోవడంపై వీహెచ్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
"గత వారం రోజులుగా పశ్చిమ బెంగాల్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని హింస జరుగుతోంది. వేలాది హిందూ కుటుంబాలు సొంత రాష్ట్రంలో నిరాశ్రయులయ్యారు. ముస్లింలను సంతృప్తి పరచాలనే ఉద్దేశ్యంతో అల్లర్ల బాధితులను రక్షించడంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది" అని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ విమర్శించారు. కేంద్రం జోక్యం చేసుకుని వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. హింసాత్మక సంఘటనలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు చేసి, దోషులను వెంటనే శిక్షించాలని శశిధర్ అన్నారు.