హైదరాబాద్ నగరంలో గత వారం రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అల్వాల్ భారతి నగర్‌లో ఉన్న ఓ పాడుబడ్డ ఇంట్లో చెట్లు, పొదలు పెరిగి పాములు వస్తున్నాయని పక్కింటి వారు అల్వాల్ వార్డ్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. అయినా కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకో కపోవడంతో ఆగ్రహానికి లోనైనా సంపత్ అనే వ్యక్తి పామును తీసుకు వచ్చి వార్డ్ ఆఫీసులో ఉన్న టేబుల్ పై వదిలేశాడు. అది చూసి వార్డ్ ఆఫీస్ సిబ్బంది తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రైవేట్ ప్రాపర్టీ కావడంతో చెట్ల పొదలను క్లీన్ చేసే అధికారం తమకు లేదని అందుకే అధికారులకు ఫిర్యాదు చేశామని వారు పట్టించుకోకపోవడం వల్లే తాను పామును తీసుకొచ్చి వార్డ్ ఆఫీసులో వదిలేయడం జరిగిందని ఆ వ్యక్తి వివరణ ఇచ్చాడు.
ఆ తర్వాత మళ్లీ పామును పట్టుకొని నిర్మానుష ప్రాంతంలో వదిలివేసిన ఘటన నిన్న మధ్యాహ్నం సమయంలో చోటుచేసుకుంది. సంపత్ కుమార్ మాట్లాడుతూ: "ఇక్కడి పౌర అధికారులు సమయానికి స్పందించరు, అనేక పారిశుధ్య సమస్యలను కూడా ప్రాధాన్యతపై పరిష్కరించాల్సిన అవసరం ఉంది" అని అన్నారు. ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ అల్వాల్ సర్కిల్ మేనేజర్ ప్రవీణను సంప్రదించగా.. కొన్ని నెలల క్రితమే బాధ్యతలు స్వీకరించినందున అల్వాల్‌లోని భరత్‌నగర్ గురించి తనకు ఎలాంటి క్లూ లేదని తెలిపారు. ఈరోజు ఈ విషయం బయటికి రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.