హైదరాబాద్‌లో అమెరికా స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని భారత్‌లో అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ ప్యాట్రీసియా ఎ లాసినా అన్నారు. 246వ అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ఏడాది సెప్టెంబరులో బాధ్యతలు స్వీకరించిన తరువాత రెండోసారి హైదరాబాద్ రావడం సంతోషంగా ఉందన్నారు. అమెరికా స్వాత్రంత్య్ర వేడుకలతో పాటు భారతదేశ 75వ స్వాత్రంత్య్ర వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. అమెరికా-భారత్ సంబంధాలు రానున్న రోజుల్లో మరింత బలోపేతం కానున్నాయని, ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు కీలక భూమికను పోషిస్తున్నాయని చెప్పారు.
మరో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు అమెరికా కంపెనీలు, సంస్థలు, ఆ దేశ పౌరులతో ఉన్న సంబంధాలు బలాన్నిస్తాయన్నారు. అమెరికా కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్మాన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నా పదవీకాలం అప్పుడే పూర్తి అవుతోందని షాక్‌లో ఉన్నట్లు తెలిపారు. అమెరికా వెళ్లినా ఇదే రకమైన సంబంధాలను కొనసాగిస్తానని అన్నారు.
అంతకుముందు యూఎస్ నిధులతో నిర్వహిస్తున్న ట్రాన్స్‌జెండర్ ఆస్పత్రిని, నానక్‌రాంగూడలో నిర్మిస్తున్న నూతన అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ప్యాట్రిసియా సందర్శించారు. అక్కడ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌లతో సమావేశమై నూతన కాన్సులేట్ జనరల్ నిర్మాణ పురోగతి గురించి చర్చించారు.