మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్‌లో హైదరాబాద్ సహా ఇతర నగరాలను యూటీ చేస్తారని వ్యాఖ్యానించిన అసదుద్దీన్.. తాము సమాధానం చెప్పేలోపే బయటకు వెళ్లారని విమర్శించారు. హైదరాబాద్‌తో సహా ఏ నగరాన్ని యూటీ చేసే ఆలోచన కేంద్రప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
ఖైరతాబాద్‌లో నిర్వహించిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాదును యూటీగా మార్చే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. అబద్ధాలు ప్రచారం చేయడం టీఆర్ఎస్, ఎంఐఎంకు అలవాటేనని విమర్శించారు. దీనిపై సమాధానం చెప్పే లోపు అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ సీటును భాజపా గెలుస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెరాస నిజస్వరూపం ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమయిందని.. బిజేపి పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎంఐఎం టి.ఆర్.ఎస్ అపవిత్ర పొత్తును ఊరూరికి తీసుకువెళ్తామన్నారు.
తెలంగాణ కోసం బలిదానాలు చేసిన వారి ఆత్మ ఘోసించేలా కేసీఆర్ వ్యవహారిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీచర్ల పోస్టులు భర్తీ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడేళ్లుగా ఎందుకు భర్తీ చేయలేదని నిలదీశారు. సీఎం పదవి చెప్పుతో పోల్చి కేసీఆర్ పవిత్ర రాజ్యాంగాన్ని, ఓటును అవమానించారని తెలిపారు. ఈ సారి రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలవడం ఖాయమన్నారు.