హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్బంగా మద్యం తాగి వాహనాలలో రోడ్లపై వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని నగర సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయన్నారు. జనవరి మొదటి వారం అంతా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాల సీజ్ తో పాటు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. మద్యం సేవించిన వారు డ్రైవింగ్ చేయకుండా క్యాబ్ లేదా డ్రైవర్లను ఆశ్రయించాలని సూచించారు. కొత్త సంవత్సవ వేడుకలను మీ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో క్షేమంగా జరుపుకోవాలని కోరుకుంటామని తెలిపారు.
న్యూ ఇయర్ సందర్బంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదిలా ఉంటే.. కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఇవాళ రాత్రి మెట్రోరైలు వేళలను పొడిగించింది. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రారంభ స్టేషన్‌ల నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరనున్నాయి.