కరోనా టీకా తీసుకున్నాక కూడా కొందరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న 20 రోజులకే ఇద్దరు డాక్టర్లకు పాజిటివ్ రావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. వీరిలో ఒకరు నిమ్స్‌కు చెఓందిన డాక్టర్ కాగా.. మరొకరు ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన పీజీ విద్యార్థి. కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తరువాత తమను వైరస్ ఏమీ చేయలేదన్న ధీమాతో నిర్లక్ష్యంగా ఉండడమే కారణమై ఉండొచ్చునని చెబుతున్నారు. అయితే.. అధికారులు మాత్రం ఈ అంశాన్ని గుట్టుగా ఉంచుతున్నారు.
మనదేశంలో జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభమైంది. తొలుత ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్ కేర్ వర్కర్లకు టీకాలు ఇచ్చారు. అయితే.. కొందరు ఈ టీకాలపై నమ్మకం లేకపోవడం, టీకా తీసుకున్న తరువాత కొద్ది మంది అస్వస్థతకు గురవుతుండడంతో 50 శాతం లబ్ధిదారులు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొలి డోస్ తీసుకున్న 28రోజుల తరువాత రెండో డోస్ ఇస్తారు. రెండో డోసు తీసుకున్న రెండు వారాల తర్వాత యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. అంటే.. యాంటీబాడీస్ పూర్తి స్థాయిలో వృద్ది చెందాలంటే 42 రోజులు పడుతుంది. అప్పటి వరకు కొవిడ్ నిబంధనలను పాటించాలని హైల్త్ అండ్ మెడికల్ డిపార్ట్‌మెంట్ ముందు నుంచి చెబుతూనే ఉంది.