రంగారెడ్డిలో ఘోర విషాదం..చెరువులో శవాలై తేలిన ఇద్దరు బాలురు

రంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 2 Feb 2026 7:31 PM IST

Rangareddy District,  Kesi Thanda, Two Children Dead

రంగారెడ్డిలో ఘోర విషాదం..చెరువులో శవాలై తేలిన ఇద్దరు బాలురు

రంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసి తాండా గ్రామంలో ఇద్దరు మైనర్ బాలురు ఇళ్ల నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యారు. ఆ తరువాత సమీపంలోని చెరువులో చనిపోయి కనిపించారు. వివరాల్లోకి వెళ్తే..కేసీ తండాకు చెందిన జాతావత్ రమేశ్ సంతానమైన బద్రీనాథ్(8), రిషి(6) సమీపంలో ఉన్న చెరువు వద్దకు కలిసి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. బాలురు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ప్రమాదవశాత్తూ చెరువులో జారిపడి ఉండవచ్చని అనుమానించారు.

సమాచారం అందుకున్న మహేశ్వరం పోలీసు సిబ్బంది, అగ్నిమాపక శాఖ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసీ తాండా సమీపంలోని చెరువు వద్ద పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ రెస్క్యూ బృందం చెరువులో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. సోమవారం తెల్లవారుజామున 7 గంటల ప్రాంతంలో కేసీ తండా సమీపంలోని చెరువు నుండి ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికితీశారు.

మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు . పోస్ట్ మార్టం, తదుపరి దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఓపెన్ వాటర్ బావుల దగ్గర ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరారు.

Next Story