వరుస నష్టాలతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కుదేలవుతోంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికి కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం పడిపోతుంది. గతేడాది జనవరిలో ఆర్టీసీకి రూ.337.79 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది జనవరిలో 287.07 కోట్లకే పరిమితం అయింది. రూ.51 కోట్ల ఆదాయం తగ్గింది. గతేడాది డిసెంబర్ ఆదాయం(రూ.352.67)తో పోల్చినా కూడా రూ.65.55 కోట్ల మేర తగ్గింది. దీంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకలకు భాగ్యనగరం(హైదరాబాద్) నగరం నుంచి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలు వసూలు చేయాలని గురువారం ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ నెల 13 నుంచి సమ్మక్క-సారలమ్మ జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యే బస్సులు నడపనున్నారు. అయితే.. ఈ బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు అంటున్నారు.
దసరా, సంక్రాంతి సమయాల్లో నడిపిన ప్రత్యేక బస్సుల్లో టీఎస్ ఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలు చేయని సంగతి తెలిసిందే. ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయకపోవడంతో సంస్థ రూ.75 నుంచి రూ.100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా.. ఇప్పుడు ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది.