బస్సులో చిల్లర మరిచిపోయానంటూ ఆర్టీసీ ఎండీకి ట్వీట్.. ఆ తరువాత
TSRTC MD immediate responds on student tweet.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(టీఎస్ ఆర్టీసీ) ఎండీగా సజ్జనార్
By తోట వంశీ కుమార్ Published on 7 Nov 2021 11:54 AM ISTతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(టీఎస్ ఆర్టీసీ) ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూనే ప్రయాణీకుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటూ ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రయాణీకులు ఇచ్చే ఫిర్యాదులను స్వయంగా ఆయనే చూస్తూ వాటిని పరిష్కరిస్తూ ప్రజల్లో ఆర్టీసీకి మంచి పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. ఓ ప్రయాణీకుడు చిల్లర మరిచిపోయిన విషయాన్ని సజ్జనార్‌కు ట్వీట్ చేయగా.. ఫోన్ పే ద్వారా నగదును పంపించారు.
సాధారణంగా మనం బస్సుల్లో ఎక్కినప్పుడు టికెట్ తీసుకునే క్రమంలో రూ.100 లేదా రూ.500 ఇచ్చినప్పుడు టిక్కెట్ వెనుక మిగతా చిల్లర రాయడం మామూలే. కొన్ని సందర్భాల్లో మనం ఆ విషయాన్ని మరిచి పోయి బస్సు దిగేస్తుంటాం. అలాగే హైదరాబాద్‌లో కూడా విద్యార్థి ఇలాగే చిల్లర మరిచిపోయాడు. అయితే.. ఆ డబ్బులను వెనక్కు పొందడం విశేషం. వివరాల్లోకి వెళితే.. సీతాఫల్ మండికి చెందిన లిక్కిరాజు అనే వ్యక్తి గురువారం(నవంబర్ 4న) బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు జీడిమెట్ల డిపో బస్సు ఎక్కాడు. రూ.20 టిక్కెట్‌కు రూ.100 నోటు ఇచ్చాడు.
తన దగ్గర చిల్లర లేకపోవడంతో కండక్టర్ టికెట్ వెనుక రూ.80 రాసి అతడికి ఇచ్చాడు. అయితే.. గమ్యస్థానం చేరిన సమయంలో ఆ విద్యార్థి చిల్లర విషయాన్ని మరిచి పోయి బస్సు దిగిపోయాడు. తుది ప్రయత్నంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ట్యాగ్‌చేస్తూ జరిగిన విషయాన్ని వివరించాడు. వెంటనే స్పందించిన సజ్జనార్.. జీడిమెట్ల డిపో మేనేజర్‌తో మాట్లాడారు. శనివారం సదరు విద్యార్థికి చెల్లించాల్సిన రూ.80 నగదును ఫోన్‌పే ద్వారా పంపించారు. సమస్యను వెంటనే పరిష్కరించిన ఆర్టీసీ ఎండీ, డిపో మేనేజర్‌లపై నెటీజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.