ఆర్టీసీ బస్సుల్లో భారీగా పెరిగిన లగేజీ ఛార్జీలు
TSRTC Hikes excess luggage fare.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రయాణీకుల లగేజీపై దృష్టి
By తోట వంశీ కుమార్ Published on 20 July 2022 4:04 AM GMTతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రయాణీకుల లగేజీపై దృష్టి సారించింది. బస్సుల్లో తరలించే లగేజీ ఛార్జీలను భారీ ఎత్తున పెంచేసింది. 50 కిలోల లగేజీ వరకు ఉచిత అవకాశాన్ని అలాగే కొనసాగిస్తూనే అదనపు లగేజీపై ఛార్జీలను పెంచేసింది. పల్లె వెలుగు బస్సుల్లో 25 కి.మీ. దూరానికి ఇప్పటివరకు ఉన్న రూపాయి చార్జీని ఏకంగా రూ.20కి పెంచింది. ఎక్స్‌ప్రెస్, ఆపై కేటగిరీ బస్సుల్లో ఇదే దూరానికి ఉన్న రూ.2 చార్జీని రూ.50కి పెంచింది. సిటీ బస్సుల్ని కూడా వదలలేదు. పెరిగిన ఛార్జీలు శుక్రవారం(జూలై 22) నుంచి అమల్లోకి రానున్నాయి.
లగేజీ చార్జీలను 2002లో ఖారారు చేయగా ఇప్పటికీ అవే అమలుఅవుతున్నాయి. 2002 తరువాత పలుమార్లు టికెట్ చార్జీలు పెరిగినా లగేజీ చార్జీలను సవరించలేదు. డీజిల్ ధరలతో పాటు మానవ వనరుల వ్యయాలు పెరగడంతో వాటిని పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని, ఆర్టీసీ కార్గో సేవలను ప్రోత్సహించేందుకు ఆ చార్జీలతో సమానంగా లగేజీ చార్జీలను పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
50 కిలోలు మించితే బాదుడే..
ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణీకుడు తమ వెంట 50 కిలోల బరువుండే సామగ్రిని ఉచితంగా తీసుకెళ్లొచ్చు. అంతకంటే మించి ఉండే సామగ్రిపై చార్జీలు విధిస్తారు. 25 కిలోల వరకు బరువును ఓ యూనిట్‌గా పరిగణిస్తారు. అంటే ఉచిత పరిమితికి మించి ఒక కిలో ఎక్కువున్నా సరే, దాన్ని ఒక యూనిట్‌గానే పరిగణించి చార్జీ వసూలు చేయనున్నారు. 25 కిలోల కంటే ఒక కిలో ఎక్కువగా ఉన్నా దాన్ని రెండో యూనిట్‌గా పరిగణించి చార్జీ విధిస్తారు. ఆ మేరకు చార్జీలు నిర్ధారించారు.
ప్రతి యూనిట్‌కు ఇప్పటి వరకు పల్లెవెలుగు బస్సుల్లో 25 కిలోమీటర్ల దూరం వరకు రూ.1 వసూలు చేయగా శుక్రవారం నుంచి రూ.20కి వసూలు చేస్తారు. అదే విధంగా 26 నుంచి 50 కిలోమీటర్ల మధ్య లగేజీ చార్జీ ప్రతి యూనిట్‌కు రూ.2 ఉండగా అది కాస్తా రూ.38 పెంచి రూ.40కి తీసుకువెళ్లారు. 51-75కి.మీ మధ్య రూ.3గాను రూ.60, 76-100 కి.మీ మధ్య రూ.4గాను రూ.70గా చార్జీలను సవరించారు.