తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) మరో సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అర్థరాత్రి తరువాత జన సమ్మర్థం ఉండే ప్రాంతాలకు బస్సులు నడుపుతుండగా.. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పరిసర బస్టాపులకు ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచితంగా వెళ్లేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
అల్ఫా హోటల్, రేతిఫైల్ బస్టాండ్, బ్లూసీ హోటల్ ఎదురుగా ఉండే ఉప్పల్ బస్టాప్, మెట్టుగూడ, చిలకలగూడ, గాంధీ ఆసుపత్రివైపు బస్టాపులకు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో ఇరువైపులా ఉన్న ఫ్లాట్‌ఫామ్స్‌పై ఆర్టీసీ ఎలక్ట్రిక్(బ్యాటరీ) వాహనాలకు సంబంధించిన సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
రైలు దిగిన ప్రయాణీకులు ఆయా కేంద్రాల వద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలో చెబితే.. అక్కడికే బ్యాటరీ వాహనాలను రప్పిస్తారు. వారిని బ్యాటరీ వాహనాల్లో ఎక్కించుకుని వారు వెళ్లాల్సిన సిటీ బస్సులు ఎక్కడ ఆగుతాయో అక్కడకు తీసుకువెళ్లి దిగబెడతారు. ఒక వేళ మెట్రో రైలులో వెళ్లాలని అనుకుంటే అదే విషయం చెబితే.. మెట్రో స్టేషన్ కు తీసుకువెలుతారు. బ్యాటరీ వాహనాల వల్ల ప్రయాణీకులు బస్టాప్‌లకు చేరుకునేందుకు ఎదుర్కొనే ఇబ్బందులు తప్పనున్నాయి. మరో వారం పది రోజుల్లోనే ఈ ఉచిత వాహన సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.