TSRTC సరికొత్త ఆఫర్
By - Nellutla Kavitha | Published on 4 April 2022 6:16 PM ISTపండుగలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక స్థలాల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సందర్శకులు, ప్రయాణికులు పెద్ద మొత్తంలో ఆర్టీసీని వినియోగించుకునేలా TSRTC ఆఫర్ లను కూడా ప్రకటిస్తోంది. ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా రామాలయాలను సందర్శించే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది. 30 మంది ప్రయాణికులు ఉన్న చోటికే బస్సు ఏర్పాటు చేస్తామని TSRTC సర్వీసులను వినియోగించుకోవాలని ప్రకటించింది.
దీంతోపాటుగా ఈ మధ్య పునర్నిర్మించిన యాదాద్రి ఆలయ సందర్శన కోసం మినీ బస్సులను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు ఉగాది పండుగ రోజు 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచితంగా ప్రయాణం ఏర్పాట్లను కూడా చేశారు. ఇక మహిళా దినోత్సవం, బాలల దినోత్సవం రోజుల్లో మహిళలు, బాలల కోసం ఆఫర్లను, ప్రత్యేక సదుపాయాలను కూడా చేసింది ఆర్టీసీ.
ఇక ఇప్పుడు సరికొత్తగా విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం మరో ఆఫర్ తో ముందుకొచ్చింది టి ఎస్ ఆర్ టి సి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆర్టీసీ బస్సులో కనుక వెళ్తే ఆప్ అండ్ డౌన్ టిక్కెట్ పై 20 శాతం రాయితీని ప్రకటించింది. తిరుగు ప్రయాణాన్ని పది రోజుల్లోపు ఎక్కడైనా వినియోగించుకోవచ్చని ప్రకటన విడుదల చేశారు అధికారులు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు టికెట్ బుక్ చేసుకుంటే ఈ ఆఫర్ పది రోజుల వరకు ఉంటుందని ప్రకటించింది ఆర్టీసీ. అయితే వన్ వే ప్రయాణానికి సంబంధించి టికెట్లో రాయితీ విషయం ఇప్పుడే చెప్పలేమని, దానిపై త్వరలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని అన్నారు TSRTC MD VC సజ్జనార్.