జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశంలో మేయర్ అధ్యక్షతన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

By అంజి  Published on  23 Jun 2023 11:59 AM IST
Telangana Martyrs, GHMC, Hyderabad

జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశంలో మేయర్ అధ్యక్షతన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల చివరి రోజు గురువారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.

అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నగర మేయర్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఎందరో అమరవీరుల స్వప్నం, ప్రజల చిరకాల కోరిక అన్నారు. తెలంగాణ రాష్ట్ర స్వప్నం నెరవేరడం కోసం 60 సంవత్సరాలుగా ఈ నెల పై పుట్టిన బిడ్డలు అనేక పోరాటాలు జరిపారని తెలిపారు. మొదటి సారి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం 1942 నుండి 1948 వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్న, హరిజన ముత్తమ్మ, బండి యాదగిరి, షేక్ బందగి, సోయబ్ ఉల్లా ఖాన్ లాంటి ఎందరో వీరులు ఈ నెల కోసం ప్రాణాలు అర్పించారు. అయినా తెలంగాణ తల్లికి విముక్తి లభించలేదు. మళ్లీ 1969లో మొదలైన తెలంగాణ మలిదశ పోరాటం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, మేధావులు, ప్రముఖ రాజకీయ నాయకులు చేరికతో ఉద్యమం బలపడి తొలిదశ ఉద్యమం తొలి అమరుడు 17 సంవత్సరాల శంకర్ అనే విద్యార్థి ప్రాణం త్యాగంతో ఉద్యమం ఎగసిపడి 369 విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేసినా రాష్ట్ర స్వప్నం నెరవేరలేదు. నాటి అమరవీరులకు ప్రతిరూపం గన్ ఫౌండ్రీలో గల స్మారక స్థూపం నిదర్శనం అని తెలిపారు.

1956 నుండి 2001 సంవత్సరం వరకు ప్రజల ఆకాంక్ష పై సంస్కృతి, సంప్రదాయాలపై, నీళ్లు, నిధులు, నియామకాలలో జరుగుతున్న దోపిడీపై ఎందరో యువకుల త్యాగాలతో తెలంగాణ ఉద్యమం నింగికి ఎగిరి నేలపై పడుతున్న ఫినిక్స్ పక్షిలా 2009 నవంబర్ 29న నాటి ఉద్యమ నాయకుడు నేటి మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష తో మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపిరి పోసుకుందని అన్నారు. ప్రజా ఉద్యమ త్యాగాల ఫలితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించబడిందన్నారు.

సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో నూతనంగా నిర్మించిన సచివాలయం కు డా.బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకొని అమరవీరుల స్మారక చిహ్నం సాక్షిగా ప్రజల ఆకాంక్షలతో పాటు సంస్కృతి సంప్రదాయాలను పెంపొందిస్తూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలించిందని తెలిపారు. నాటి తెలంగాణ ఉద్యమానికి జీవం పోసిన జలదృశ్యంలో అమరుల స్మారక చిహ్నం ఏర్పాటు అమరుల త్యాగాలకు కేసీఆర్ గారి ఇచ్చే నివాళి అని అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర స్వప్నం కోసం ప్రాణాలర్పించిన మలిదశలో తొలి అమరుడు శ్రీకాంతాచారి అన్నారు.

తెలంగాణ ప్రగతి కాంతులతో మీ త్యాగమే ప్రతిఫలిస్తున్నది.... అమరులారా మీకు జోహార్లు.... అమరవీరుల ఆత్మకు శాంతి కలిగేలా మౌనం పాటించారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఈ.వి.డి.ఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలా, జోనల్ కమిషనర్లు మమత, శ్రీనివాస్, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, సిసిపి దేవేందర్ రెడ్డి వివిధ విభాగాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story