తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాలు.. శనివారం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic restrictions in Hyderabad Today.శనివారం హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు
By తోట వంశీ కుమార్ Published on 17 Sep 2022 3:46 AM GMTతెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాల సందర్భంగా శనివారం హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా పార్కు చుట్టూ 3 కిలోమీటర్ల మేర పూర్తిగా స్థాయి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ ఆంక్షలు శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అమల్లో ఉండనున్నాయి.
కవాడిగూడ ఎక్స్‌రోడ్స్ నుంచి షెయిలింగ్ క్లబ్, లోయర్ ట్యాంక్ బండ్‌కు ట్రాఫిక్ అనుమతి లేదు. ఈ వాహనాలను కవాడిగూడ ఎక్స్ రోడ్స్ నుంచి బైబిల్ హౌస్ వైపు మళ్లిస్తారు. అశోక్‌నగర్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వైపు అనుమతి లేదు. వాహనాలను బాకారం బ్రిడ్జి నుంచి సీజీవో టవర్స్ బన్సీలాల్‌పేట్ వైపు మళ్లించనున్నారు. ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వైపు ట్రాఫిక్‌కు అనుమతించరు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద నుంచి నారాయణగూడ క్రాస్‌రోడ్డు వైపు మళ్లిస్తారు. ఆజామాబాద్ జంక్షన్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వైపు ట్రాఫిక్ అనుమతించరు. ఈ ట్రాఫిక్‌ను వీఎస్‌టీ క్రాస్‌రోడ్స్ నుంచి బాగ్‌లింగంపల్లి వైపు మళ్లిస్తారు. సాధురామ్ కంటి ఆస్పత్రి నుంచి ఏవీ కాలేజీ మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వైపు ట్రాఫిక్ అనుమతించరు.
దోమల్‌గూడ టీ జంక్షన్ నుంచి చిక్కడపల్లి మెట్రో స్టేషన్, ఆర్టీసీ క్రాస్ రోడ్డువైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి అప్పర్‌ట్యాంక్ బండ్‌కు ట్రాఫిక్‌ను అనుమతించరు. లిబర్టీ వద్ద హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. పాత సచివాలయం గేట్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా లిబర్టీ వైపు మళ్లిస్తారు. నారాయణగూడ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డుకు.. అక్కడి నుంచి ఎన్టీఆర్ స్టేడియం వైపు వాహనాలకు అనుమతి లేదు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి ఆ వాహనాలను ముషీరాబాద్ వైపు మళ్లిస్తారు. రాణిగంజ్, ఎంజీరోడ్డు, ఆర్పీరోడ్డు నుంచి అప్పర్ ట్యాంక్ వైపు ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఈ వాహనాలను కర్బాలా మైదాన్ నుంచి బైబిల్ హౌస్, ముషీరాబాద్ వైపు మళ్లిస్తారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఇక్బాల్ మినార్ (రవీంద్రభారతి) నుంచి కట్టమైసమ్మ వైపు అనుమతిలేదు. కట్టమైసమ్మ ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వెళ్లే రోడ్డు మూసి ఉంటుంది. నెక్లెస్ రోడ్డు కూడా రెండు వైపులా మూసి ఉంటుంది. ట్రాఫిక్‌కు అనుమతి ఉండదు.