ఫార్ములా - ఈ కోసం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic restrictions in Hyderabad for Formula E racing. హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి 11న ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేసింగ్ జరగనుంది.
By అంజి Published on 1 Feb 2023 5:20 AM GMTహైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి 11న ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేసింగ్ జరగనుంది. ఈ ఈ రేసింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 5 నుంచి నగరంలోని హుస్సేన్‌సాగర్ సరస్సు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మరియు మింట్ కాంపౌండ్ ఐ మ్యాక్స్ వరకు ట్రాఫిక్ అనుమతించబడదు. అలాగే హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మంగళవారం ఫార్ములా ఈ ట్రాక్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు.
రేసింగ్‌లకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలియజేశారు. రాబోయే కొద్ది రోజుల్లో రోడ్ల పాక్షిక మూసివేత అమల్లోకి వస్తుందని, ఫిబ్రవరి 11 వరకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా దేశంలోనే మొదటిసారిగా జరుగుతున్న ఫార్ములా ఈ రేసింగ్ కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ రేస్‌కు హైదరాబాద్ వేదిక కాబోతోంది. మరోవైపు ఈ రేస్‌ను చూసేందుకు ఇప్పటికే చాలా మంది ఔత్సాహికులు టికెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు.
కాగా ఫిబ్రవరి 17న ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, ఫార్ములా ఈ రేస్ ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం చర్చించారు. ప్రత్యామ్నాయ మార్గాల గురించి ప్రజలకు తెలియజేయాలని ఆమె అన్నారు. ఫార్ములా ఈ రేసు కారణంగా సచివాలయ పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సిద్ధం చేయాలన్నారు.