'భీమ్లానాయక్' ప్రీ రిలీజ్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
Traffic Diversions in Yousufguda Due to Bheemla Nayak pre release event.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కీలక
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2022 11:01 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'భీమ్లానాయక్'. మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూసుఫ్‌గూడలోని పోలీస్ లైన్స్ గ్రౌండ్స్‌లో నేడు(బుధవారం) నిర్వహిస్తున్నారు.
భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో ఈరోజు(బుధవారం) నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మధ్యాహ్నాం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు యూసుఫ్‌గూడ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. మైత్రివనం నుంచి యూసఫ్‌గూడ వైపు వచ్చే వాహనాలు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి యూసఫ్‌గూడ వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నామని వెల్లడించారు. దీంతో వాహనదారులు ఆ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. ఇక ప్రీ రీలీజ్ ఈవెంట్‌కు పాస్‌లు ఉన్నవారు మాత్రమే రావాలన్నారు. ఈ నెల 21 తేదీతో ఇచ్చిన పాసులకు అనుమతి లేదని.. ఈ రోజు తేదీతో ఉన్న పాసులను మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.
– జూబ్లీహిల్స్ రోడ్ నం. 5 నుంచి యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలను కమలాపురి కాలనీ, శ్రీనగర్ కాలనీ మీదుగా మళ్లిస్తారు.
– అమీర్‌పేట మైత్రీవనం నుంచి యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ మీదుగా ట్రాఫిక్‌ను అనుమతించరు. ఆ ట్రాఫిక్‌ను కమలాపురి కాలనీ, ఇందిరానగర్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నం. 5వైపు మళ్లిస్తారు.
ఈవెంట్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ సమీపంలోని సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, సవేరా ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం, యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలోని ఖాళీ స్థలంలో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.