హైదరాబాద్‌ చేరుకున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు

సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ కీలక నేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.

By Medi Samrat  Published on  16 Sept 2023 2:34 PM IST
హైదరాబాద్‌ చేరుకున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు

సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ కీలక నేతలంతా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, సీనియ‌ర్ నాయ‌కురాలు సోనియా గాంధీ, మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ సహా ముఖ్య నేతలకు రాష్ట్ర నాయకత్వం ఘ‌న‌ స్వాగతం పలికింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణగోపాల్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. కాంగ్రెస్‌ అగ్రనేతలంతా రెండు రోజుల‌ పాటు హైదారాబాద్‌లోనే ఉండనున్నారు. హోటల్‌ తాజ్‌ కృష్ణలో రెండు రోజులు సమావేశాలు జ‌రుగ‌నుండ‌గా.. రేపు తుక్కుగుడాలో భారీ బ‌హిరంగ స‌భ జ‌రుగ‌నుంది.

తెలంగాణాతోపాటు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం, ఆదివారాల్లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్య్లుసి) సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు, సోనియగాంధీ, రాహుల్‌, ప్రియాంకగాంధీ లతోపాటు పలువురు సీనియర్‌నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనబోయే ముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం విలేకర్లతో మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వ్యూహరచనపై పార్టీ అగ్రనేతలు ఈ సిడబ్ల్యుసి సమావేశాల్లో చర్చించనున్నారు. ఇండియా కూటమిపై, కూటమిలోని మా భాగస్వాములతో తదుపరి సమావేశంలో చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు. కాగా కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న సిడబ్ల్యుసి ఇదే తొలి సమావేశం కావడం విశేషం.

Next Story