హైదరాబాద్‌లోని టాప్ 5 కొత్త పర్యాటక ప్రదేశాలు.. తప్పక సందర్శించండి

Top 5 new tourist destinations of Hyderabad. చార్మినార్ వంటి చారిత్రక ప్రదేశాల నుండి హుస్సేన్ సాగర్ వరకు.. హైదరాబాద్‌లో వివిధ

By అంజి  Published on  19 Feb 2023 12:46 PM IST
హైదరాబాద్‌లోని టాప్ 5 కొత్త పర్యాటక ప్రదేశాలు.. తప్పక సందర్శించండి

చార్మినార్ వంటి చారిత్రక ప్రదేశాల నుండి హుస్సేన్ సాగర్ వరకు.. హైదరాబాద్‌లో వివిధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. దీని కారణంగా నగరానికి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. హైదరాబాదీలు వివిధ రకాల ఆహారాన్ని రుచి చూడడానికి, కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి కూడా ప్రసిద్ధి చెందారు. దీంతో తెలంగాణ పర్యాటక రంగం గత కొన్ని సంవత్సరాలుగా కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ కథనంలో.. నగరంలోని కొత్త పర్యాటక ఆకర్షణల గురించి మేము మీకు చెప్తాము.. మీకూ వీలున్నప్పుడూ తప్పక సందర్శించండి.

1. బన్సీలాల్ పేట్ స్టెప్ వెల్

బన్సీలాల్‌పేట్‌లోని 17వ శతాబ్దపు పాత స్టెప్‌వెల్ ఇప్పుడు పునరుద్ధరించబడింది. స్టెప్‌వెల్‌ దగ్గర అద్భుతమైన మేక్ఓవర్, లైట్లు ఖచ్చితంగా మీకు నచ్చేలా చేస్తాయి. కొత్తగా పునరుద్ధరించబడిన ఈ మెట్ల బావిని చూసేందుకు స్థానికులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తున్నారు. ఇది ప్రముఖ సెల్ఫీ పాయింట్‌గా మారింది.

2. మల్కం చెరువు పార్కు

మల్కం చెరువు పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధితో పశ్చిమ హైదరాబాద్‌కు కొత్త పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది. నగరంలోని రాయదుర్గం చెరువు గ్రీన్ పార్క్‌తో పునరుద్ధరించబడింది. దీనికి 'మల్కం చెరువు పార్క్' అని పేరు పెట్టారు. సుమారు 50 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ పార్క్ పిల్లల ఆటల కోసం, నడక స్థలం, పచ్చని ఉద్యానవనాలను అందిస్తుంది. పార్క్ వెలుపల ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి.

3. గండిపేట్ పార్క్

ఉస్మాన్ సాగర్‌లోని ఈ ల్యాండ్‌స్కేప్ పార్క్ ఇటీవలే ప్రారంభించబడింది. ఎకో-పార్కు పర్యాటకుల రద్దీని చూస్తోంది. హెచ్‌ఎండీఏ సుమారు 30 వేల కోట్ల రుపాయలకుపైగా వెచ్చించింది. 18 ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేసింది. గండిపేటలోని ఈ పార్కులో ఇన్ఫినిటీ పూల్, అక్వేరియం, విలాసవంతమైన చెక్క కాటేజీలు, క్యాంపింగ్ టెంట్లు, పక్షిశాల, సీతాకోకచిలుక తోట వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చూడవచ్చు.

4. దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్క్ & కేబుల్ బ్రిడ్జ్

దుర్గం చెరువు వద్ద ఉన్న కేబుల్ వంతెన హైదరాబాదీలకు, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించే వారికి ప్రసిద్ధ ప్రదేశంగా మారింది. ఇక్కడ కొంతమంది వ్యక్తులు రీల్స్, షార్ట్ వీడియోలు చేయడానికి వస్తున్నారు. మరికొందరు ఫోటోలు తీసుకోవడానికి వస్తున్నారు. సరస్సులో బోటింగ్ ఇతర వినోద కార్యక్రమాలను ఆనందించవచ్చు.

5. హుస్సేన్ సాగర్ వద్ద భారతదేశపు అతిపెద్ద మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్

హుస్సేన్ సాగర్ వద్ద భారతదేశంలోని అతిపెద్ద మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ వివిధ పర్యాటకులకు ఆకర్షణీయ ప్రదేశంగా మారింది. మ్యూజికల్ ఫౌంటెన్‌ను చూసేందుకు ప్రజలు ఎక్కువగా సాయంత్రం వేళల్లో హుస్సేన్ సాగర్‌ను సందర్శిస్తారు. సోషల్ మీడియా కూడా మ్యూజికల్ ఫౌంటెన్ చిత్రాలతో నిండిపోయింది. ట్యాంక్‌బండ్‌ దగ్గర పర్యాటక శాఖ ఈ అద్భుతమైన ఫౌంటెన్‌ను ఎలా ఏర్పాటు చేసిందో చూడండి.


Next Story