టీఆర్ఎస్ ప్లీనరీ.. రేపు సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
Tomorrow Traffic Restrictions in Cyberabad.తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ వేడుకలు రేపు(శుక్రవారం)
By తోట వంశీ కుమార్ Published on 26 April 2022 11:49 AM ISTతెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ వేడుకలు రేపు(శుక్రవారం) హైదరాబాద్‌లో అట్టహాసంగా జరగనున్నాయి. మాదాపూర్ హెచ్ఐసీసీ వేదికగా టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
27న ఉదయం 8 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 7 వరకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కొత్తగూడ టు హైటె క్స్, సైబర్ టవర్స్ టు ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్ టు కొత్తగూడలో ఉన్న ఐటీ కంపెనీలు తమ టైమింగ్స్‌లో కొద్దిగా మార్పులు చేసుకోవాలని సూచించారు. భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలు..
- నీరూస్ నుంచి గచ్చిబౌలి మీదుగా వచ్చే వాహనదారులు సైబర్ టవర్స్ వైపు వెళ్లకుండా, సీఓడీ వద్ద డైవర్సన్ తీసుకొని దుర్గం చెరువు, ఇనార్బిట్, ఐటీసీ కోహినూర్, ఐకియా, బయోడైవర్సిటీ మీదుగా వెళ్లాలి.
- మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట నుంచి హైటెక్ సిటీ మీదుగా వెళ్లే వాహనదారులు సైబర్ టవర్స్, జూబ్లీహిల్స్, ఏఐజీ హాస్పిటల్, దుర్గం చెరువు ఇనార్బిట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
- ఆర్‌సీపురం, చందానగర్ నుంచి మదాపూర్, గచ్చిబౌలి వెళ్లాల్సిన వాహనదారులు.. ఆల్విన్ చౌరస్తా, కొండాపూర్ వైపు వెళ్లకుండా బీహెచ్‌ఈఎల్, నల్లగండ్ల, హెచ్‌సీయూ, ఐఐటీ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.