టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భారీ చలనం రాబోతోందా..!

Tollywood Drug Case Excise hands over 800 page file 60GB video 10 Audio Evidence to ED.టాలీవుడ్ ప్రముఖులపై ఐదేళ్ల నాటి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2022 7:37 AM GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భారీ చలనం రాబోతోందా..!

టాలీవుడ్ ప్రముఖులపై ఐదేళ్ల నాటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగం కేసులో తెలంగాణ ఎక్సైజ్, ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-హైదరాబాద్ యూనిట్‌కు 'డాసియర్'ను అందజేసింది. డాసియర్‌లో 800పేజీల ఫైల్స్‌, 60 GB (వీడియో సాక్ష్యం), 10 ఆడియో రికార్డింగ్‌లు ఉన్నాయి. 800 పేజీల ఫైల్‌లో ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జ్ షీట్, నమోదైన 12 కేసుల్లో నిందితులు, సాక్షులు, అనుమానితుల వాంగ్మూలాలు ఉన్నాయి. 60 GB సాక్ష్యంలో CD, పెన్ డ్రైవ్లు ఉన్నాయి. 2017లో ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ సందర్భంగా చిత్రీకరించిన టాలీవుడ్ ప్రముఖుల వీడియో రికార్డింగ్‌లు ఇందులో ఉన్నాయి. ఆడియో సాక్ష్యాలను డీకోడ్ చేశారు. నిందితుల వివరణాత్మక రికార్డులు కూడా ఉన్నాయి.

2017లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్.. నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ కింద 12 కేసులను బుక్ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) 11 ఛార్జ్ షీట్లను డ్రగ్ పెడ్లర్లు, వినియోగదారులపై దాఖలు చేసింది. తెలుగు సినీ ప్రముఖులను పిలిపించి విచారించినా ఆధారాలు లేకపోవడంతో వారిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. మనీలాండరింగ్‌పై హైకోర్టు ఆదేశాల మేరకు ఈడీ కేసును విచారిస్తోంది. మార్చి 2022లో, రాష్ట్ర హైకోర్టు ఆదేశాన్ని పాటించనందుకు తెలంగాణ ముఖ్య కార్యదర్శి, ఎక్సైజ్ శాఖపై ED ధిక్కార కేసును దాఖలు చేసింది. ఈ ఆర్డర్ కు సంబంధించి ఆడియో-వీడియో రికార్డింగ్‌లు, ఇతర సంబంధిత పత్రాలను EDకి అందజేశారు.

మాదకద్రవ్యాల కేసు విచారణ

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) కింద ED కేసులను విచారిస్తుంది. ఈ ప్రత్యేక కేసు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగానికి సంబంధించినది. ఈ ఘటనకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నేటికీ నోరు మెదపలేదు. 12 కేసుల్లో నిందితులు కొనుగోలు చేసిన డ్రగ్స్ ఖరీదు రూ.25 లక్షలకు మించదని తెలుస్తోంది. అందుకు సంబంధించి దర్యాప్తు అధికారుల నుంచి ఆధారాలు సేకరించారు. చాలా వరకూ ఈ కేసుల్లో కొకైన్, ఎల్‌ఎస్‌డి బ్లాట్‌లు, ఎమ్‌డిఎంఎ, ఎక్స్‌టసీ, గంజాయిని తక్కువ పరిమాణంలో వినియోగించినందుకు నమోదు చేసినవి.

"ఎన్‌డిపిఎస్ చట్టం కింద బుక్ చేయబడిన 12 కేసులలో 10 కేసులలో, దొరికిన నిషిద్ధ వస్తువులు చాలా 'తక్కువ పరిమాణంలో' ఉన్నాయి. మిగిలిన రెండు కేసులలో, కనుగొనబడిన డ్రగ్స్ పరిమాణం కాస్త ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అమ్మకం కోసం ఉంచారని అనుమానాలు ఉన్నాయని' అని ఒక మూలం న్యూస్‌మీటర్‌కి తెలిపింది. తక్కువ మొత్తంలో నిషేధిత పదార్థాలతో పట్టుబడిన వ్యసనపరులు ప్రభుత్వం గుర్తించిన కేంద్రాలలో పునరావాసం పొందగలరు.

కేసుకు సంబంధించిన కీలక వివరాలు:

వార్తల్లో నిలిచిన ప్రముఖుల డ్రగ్స్ కేసును 2020 వరకు.. అంటే దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సైలెంట్ గా ఉంచి ఈడీ కోర్టును ఆశ్రయించింది. 2017లో కాంగ్రెస్‌కు చెందిన మల్కాజిగిరి ఎంపీ, ప్రస్తుతం కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు బదిలీ చేయాలని హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రాముఖులను ప్రభుత్వం తప్పిస్తుందని, ఈడీ అధికారులను ప్రతివాదులుగా చేరుస్తూ, లోతైన దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలన రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు.. దీనిపై విచారణ చేసిన న్యాయ స్థానం ఈడీ అధికారులను కేసు విచారణ చేయాలని కోరగా, సుమోటాగా కేసు నమోదు చేసి విచారణ చేయడానికి తాము సిద్ధం అని తెలిపారు. దీంతో ఎక్స్సైజ్ అధికారులు చేసిన ఇన్వెస్ట్ గేషన్ రిపోర్ట్స్, కేసు డైరీ మొత్తం ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రకారం తమకు కేవలం స్టేట్మెంట్ లు మాత్రమే ఇచ్చారు తప్ప, కీలక ఆధారాలు ఇవ్వలేదని, తమ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని స్వయంగా ఈడీ జాయింట్ డైరెక్టర్ హైకోర్టు కు ఫిర్యాదు చేశారు. దీంతో మరోసారి హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే ఈడీ అధికారులు అడిగిన డిజిటల్ ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ నివేదికలు, నిందితులు, సాక్షులు, విచారణ ఎదురుకొన్న ప్రముఖల స్టేటమెంట్లు ఇవ్వాలని ఆదేశించింది. ఈడీ అధికారులు అడిగిన డిజిటల్ ఆధారాలు కాకుండా నిందితులు, సాక్షులు, విచారణ ఎదురుకొన్న ప్రముఖల స్టేటమెంట్లు ఇచ్చింది ప్రభుత్వం. ఈడీ అధికారులు ఆరోపణలు ఎదుర్కొన్న సినీ ప్రముఖులను విచారణకు పిలిచినా ఎలాంటి పురోగతి లభించలేదు.

ఇక ఈ కేసులో పిటిషనర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తన దగ్గర ఉన్న కొన్ని ఆధారాలు ఈడీ అధికారులకు సమర్పించారు. కేసులో ఎందుకు లోతైన దర్యాప్తు చేయాలేకపోయారని ఈడీ అధికారులను అడిగితే తమకు ప్రభుత్వం సహకారం ఇవ్వడం లేదని, డిజిటల్ ఎవిడెన్స్ ఇవ్వడం లేదని చెప్పారు. కోర్టు ధిక్కరణ కింద న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలని లేకపోతే తానే స్వయంగా కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేస్తానని తెలపడంతో డ్రగ్స్ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రభుత్వ అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, తాము అడిగిన డిజిటల్ ఆధారాలు ఇవ్వకుండా ఆలస్యం చేశారని ఈడీ ఆరోపించింది. ఆధారాలు కోసం ఆరు సార్లు లేఖలు రాసినా కూడా ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్స్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ పై పిటిషన్ వేసింది ఈడీ. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. ఈడీ అడిగిన అన్ని వివరాలను అధికారులు ఇచ్చింది. డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా, ఎఫ్ఎస్ఎల్ నివేదికలను ఈడీకి అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు రిజిస్టర్‌కు మెమో దాఖలు చేసింది. దీంతో మరోసారి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ తారలను విచారించాలని ఈడీ భావిస్తోంది. తాజాగా అధికారుల చేతికి వచ్చిన ఆధారాలను విశ్లేషించి విచారణ చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు.

2021లో టాలీవుడ్ నటులు, దర్శకులతో సహా 12 మంది ప్రముఖులను డిపార్ట్‌మెంట్ పిలిచింది. ప్రశ్నించిన వారిలో నటులు రకుల్ ప్రీత్, రవితేజ మరియు అతని డ్రైవర్, తరుణ్, ముమైత్ ఖాన్, దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, నవదీప్ ఉన్నారు. ఈడీ ఇప్పుడు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసును దర్యాప్తు చేస్తోంది.

Next Story