తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మాత్రం ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు బోనాల పండుగ జరుగుతుంది. జూలైలో ఆషాఢ మాసం రావడంతో హైదరాబాద్ మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించకుంది. బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ముందస్తుగా మద్యం దుకాణాలు మూసివేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ వారాంతంలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
ఈ మేరకు ఉజ్జయిని మహంకాళీ బోనాల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్, నార్త్, సెంట్రల్ జోన్‌లలోని పలు ఏరియాలలో వైన్ షాప్‌లు మూసివేయనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఉత్తర్వుల ప్రకారం.. సెంట్రల్ జోన్‌లోని గాంధీ నగర్, ఈస్ట్ జోన్‌లోని చిలకల్ గుడా పరిధిలోని చిలకల్ గుడా, లాలా గుడా, వారాసి గుడా, నార్త్ జోన్‌లోని బేగం పేట్ పరధి, గోపాలపురం పరిధిలోని గోపాలపురం, తుకారం గేట్, మారేడ్ పల్లి, మహంకాళీ పరిధిలోని మహంకాళీ ఏరియా, రాంగోపాల్ పేట్, మార్కెట్ ఏరియాలలోని మద్యం, కల్లు దుకాణాలతో పాటు బార్లు 13వ తేదీ ఉదయం ఆరు గంటల నుండి 15వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు మూతపడనున్నాయి.