హైదరాబాద్: జవహర్‌నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. డంప్‌యార్డ్‌లోని పవర్ ప్లాంట్‌లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో ముగ్గురు కార్మికుల మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
డంప్‌యార్డ్‌లో బుధవారం నిర్మాణ లిఫ్ట్ కూలిపోవడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కార్మికులు మరణించారని పోలీసులు తెలిపారు. డంప్‌యార్డ్‌లో విద్యుత్ ప్రాజెక్టు (మునిసిపల్ సాలిడ్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్) ఫేజ్ 2 కోసం చిమ్నీ నిర్మాణ సమయంలో ఈ సంఘటన జరిగింది. లిఫ్ట్ ప్రమాదవశాత్తూ విడిపోయి 40 అడుగుల ఎత్తు నుంచి కూలిపోవడంతో లిఫ్ట్‌లో ఉన్న ముగ్గురు కార్మికులు గాయపడ్డారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు కానీ చికిత్స పొందుతూ వారు మరణించారు. ఈ క్రమంలోనే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ మార్చరికి తరలించారు. మృతుల వయస్సు 21 - 28 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.