సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఈ రోజు(ఆదివారం) సాయంత్రం బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు పార్టీ ప్రముఖులు ఈ సభకు హాజరై ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నాం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలు కూడా ప్రయాణీకులకు పలు సూచనలు చేసింది.
సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పారడైస్, పరేడ్ గ్రౌండ్, జేబీఎస్ మెట్రో స్టేషన్లలో రైళ్లు ఆగకుండా వెలుతాయని, ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని మెట్రో రైలు ఎండీ ఎన్వీరెడ్డి కోరారు. భద్రతా కారణాల దృష్ట్యా మూడు స్టేషన్లలో సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
గత రెండు రోజులపాటు మెట్రో రైళ్లు నిలిచిపోనున్నాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎన్వీఎస్ రెడ్డి తోసిపుచ్చారు. ఆదివారం సాయంత్రం వరకు మూడు కారిడార్లలో రైళ్లు యధావిధిగా నడుస్తాయని చెప్పారు. సభ జరుగుతున్న సమయంలో మాత్రం పై మూడు స్టేషన్లలో సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.