Hyderabad: ఘోస్ట్‌ హౌస్‌ అంటూ.. అర్ధరాత్రి యువత హల్‌చల్‌

బేగంపేట కుందన్‌బాగ్‌లోని కాలనీలో ఓ పాడుబడిన భవనం వద్ద దెయ్యాలు తిరుగుతున్నాయని సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

By అంజి  Published on  27 Oct 2023 5:00 AM GMT
Hyderabad, ghost house, Kundanbagh, Begumpet,Haunted House

Hyderabad: ఘోస్ట్‌ హౌస్‌ అంటూ.. అర్ధరాత్రి యువత హల్‌చల్‌

హైదరాబాద్‌: దెయ్యాలు ఉన్నాయో లేదో తెలియకాదు.. దెయ్యం పేరు చెబితే మాత్రం చాలా మంది భయపడిపోతుంటారు. ఇక అర్ధరాత్రి బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతారు.. కానీ కొంతమంది పోకిరీలు హైదరాబాద్‌ నగరంలోని ఓ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయంటూ నానా రచ్చ సృష్టిస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు కాస్త వైరల్‌గా మారి నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

ఈ ఘటన హైదరాబాద్ నగరంలో బేగంపేట్‌ పరిధిలోని కుందన్‌బాగ్‌లో చోటుచేసుకుంది. కొంతమంది యువకులు సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌గా తాము తీసిన వీడియోలు వైరల్ అయ్యేందుకు వింత వింత పనులు చేస్తూ ఉండటం చూస్తూ ఉంటాం.. వింటుంటాం.. అయితే కొంత మంది యువకులు ఏకంగా ఓ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కుందన్ బాగ్ లో బూతు బంగ్లా అంటూ ప్రతిరోజు అర్ధరాత్రి కాగానే కొందరు యువకులు నానా హంగామా సృష్టిస్తున్నారు. అంతేకాదండోయ్ యువకులు ఏకంగా బూత్ బంగ్లా వద్దకు వెళ్లి వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు కాస్త వైరల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి. ఈ భవనంలో గత 14 ఏళ్ల క్రితం తల్లి ,ఇద్దరు కూతుర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇప్పటికీ తల్లి, ఇద్దరు కూతుళ్ళ అనుమానాస్పద మృతి మిస్టరీగానే ఉండిపోయింది.

సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగులు వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి బూత్ బంగ్లా పేరుతో ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. గత మూడు రోజుల్లో 35 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. దెయ్యాల కొంపగా భావిస్తున్న ఆ ఇంటి గురించి పోలీసులు మాట్లాడుతూ.. ఆ ఇంటిపై వస్తున్న పుకార్లను కొట్టిపడేశారు. “కుందన్ బాగ్‌లోని ఒక పాత భవనంపై వస్తున్న వందంతులు ఎవ్వరు నమ్మవద్దు, పుకార్లు వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కుందన్ బాగ్‌లో ప్రశాంత వాతావరణం ఉంది” అని పంజాగుట్ట పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

ఆ ఇంటివద్ద కొందరు పోలీసులను మోహరించామని, గత మూడు రోజుల్లో 35 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిపై కేసులు నమోదుచేశామని, వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపామని పంజగుట్ట అసిస్టెంట్ పోలీసు కమిషనర్ మోహన్ కుమార్ తెలిపారు. మరికొన్ని రోజులపాటు ఆ ఇంటి వద్ద పోలీసులు కాపలా ఉంటారని, ఎవరైనా అటువస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story