ది రెయిన్‌వాటర్ ప్రాజెక్ట్.. పురాతనమైన మెట్ల బావులను పునరుద్ధరించడమే లక్ష్యం

The Rainwater project reviving Telangana stepwells one at a time to help build Urban Water Security.తెలంగాణలో 600లకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 April 2022 10:38 AM GMT
ది రెయిన్‌వాటర్ ప్రాజెక్ట్.. పురాతనమైన మెట్ల బావులను పునరుద్ధరించడమే లక్ష్యం

తెలంగాణలో 600లకు పైగా పురాతనమైన మెట్ల బావులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికీ బాగానే ఉన్నాయి.. చాలా వాటిలో మాత్రం టన్నుల కొద్దీ చెత్తతో నిండిపోయి ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన సోషల్ ఎంటర్‌ప్రైజ్ 'ది రెయిన్‌వాటర్ ప్రాజెక్ట్' వాటిని పునరుద్ధరించే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఇప్పటివరకు వారు హైదరాబాద్‌లోని ఆరు హెరిటేజ్ బావులను పునరుద్ధరించారు.

"ఈ పురాతనమైన బావులలో ఎంతో చెత్త ఉంటుంది. ఇది సమీపంలో నివసించే ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. సికింద్రాబాద్‌లోని బన్సిలాల్‌పేట్ స్టెప్‌వెల్‌ను పునరుద్ధరించే సమయంలో మేము దాదాపు 2,000 టన్నుల చెత్తను తొలగించాము. ఇది ప్రతిరోజూ హైదరాబాద్ నగరం ద్వారా మొత్తం ఉత్పత్తి చేయబడిన చెత్తలో 1/3 వంతు" అని ది రెయిన్‌వాటర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు కల్పనా రమేష్ అన్నారు.



"ఈ బావులు భారీగా వర్షపు నీటిని సేకరించే ప్రదేశాలు. అవి లక్షల లీటర్ల నీటిని నిల్వ చేస్తాయి.. ఇలాంటి బావులు పట్టణ ప్రాంతాల్లో వరదలను నివారించడంలో కూడా సహాయపడతాయి." అని కల్పనా రమేష్ వివరించారు. పాత బావులను పునరుద్ధరించడం అంత తేలికైన పని కాదని కల్పన అన్నారు. "ఈ బావులకు సంబంధించి చాలా వరకు డ్రాయింగ్‌లు లేదా ఎటువంటి రికార్డులు లేవు. ఈ ప్రాంతంలో నివసించే చాలా మంది నివాసితులకు కూడా ఈ బావుల ఉనికి గురించి తెలియదు," ఆమె అన్నారు. ఈ మెట్ల బావులను అనువైనవిగా మార్చడం కూడా ఒక ప్రధాన పని. "మేము ఈ బావి ప్రాముఖ్యత గురించి స్థానికులకు అవగాహన కల్పిస్తాము. ఇలాంటి చోట్ల కాఫీ షాప్‌తో పాటు చిన్న సీటింగ్ ఏరియాని సృష్టించడం ద్వారా దానిని మరింత మందికి తెలిసేలా ప్లాన్ చేస్తున్నాము. ఈ హెరిటేజ్ స్టెప్-వెల్‌లను మినీ-టూరిస్ట్ స్పాట్‌లుగా మార్చవచ్చు," కల్పన వివరించారు.


చాలా సంవత్సరాల క్రితం, కల్పన హైదరాబాద్‌కు వచ్చినప్పుడు, ప్రజలు ట్యాంకర్ల కోసం పడే అవస్థలు చూసి ఆమె ఆశ్చర్యపోయింది. సహజ వనరుగా వర్షపు నీటి ప్రాముఖ్యతను ప్రజలకు అర్థం చేసుకోవడంలో సహాయపడే లక్ష్యంతో, ఆమె ది రెయిన్‌వాటర్ ప్రాజెక్ట్‌ను స్థాపించారు. స్టెప్‌వెల్‌లను పునరుద్ధరించడమే కాకుండా, ప్రజలు వర్షపునీటి సంరక్షణపై శ్రద్ధ చూపేలా వివిధ ప్రాజెక్టులను చేపట్టారు.

"మేము ఒక ప్రాంతాన్ని సందర్శిస్తాము. మా జియో-హైడ్రాలజిస్ట్‌లు, ఇతర నిపుణుల బృందంతో కలిసి ఆ స్థలాన్ని అంచనా వేస్తాము. మేము అన్ని రకాల ప్రదేశాలకు(పరిశ్రమలు, మాల్స్, అపార్ట్‌మెంట్‌లు మొదలైనవి) సరిపడేలా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్‌లను కూడా నిర్మిస్తాము.. ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా ప్రణాళికలను అమలు చేస్తాము. " అన్నారు కల్పన.



నీతి ఆయోగ్ ప్రకారం 2050 నాటికి భూగర్భ జలాలు అడుగంటిపోయే నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అయితే, ది రెయిన్‌వాటర్ ప్రాజెక్ట్ మాత్రం.. ఇప్పుడు సరైన చర్యలు తీసుకుంటే పరిస్థితులు మెరుగవ్వచ్చని నమ్ముతుంది.

ప్రధాని మోదీ ప్రశంసలు:

ఈ సంవత్సరం ప్రారంభంలో, తన 'మన్ కీ బాత్' ప్రసంగంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట్ మెట్ల బావి వద్ద చేపట్టిన పునరుద్ధరణ ప్రయత్నాలను ప్రశంసించారు. నీటి సంరక్షణ, నీటి వనరుల పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించిన ప్రధాని మోదీ, "దేశంలో చాలా మంది ప్రజలు నీటి సంరక్షణను జీవిత మిషన్‌గా మార్చుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అనేక మెట్ల బావులు శతాబ్దాల నాటివి. మన వారసత్వంలో భాగమైనవి. బన్సీలాల్‌పేట్ మెట్ల బావి కూడా అందులో ఒకటి. ఏళ్ల తరబడి నిర్లక్ష్యం కారణంగా ఈ మెట్ల బావి మట్టితో, చెత్తతో నిండిపోయింది. అయితే ఇప్పుడు ఈ మెట్లబావిని పునరుద్ధరించాలనే ప్రయత్నం మొదలైంది" అని అన్నారు.

సికింద్రాబాద్‌లో ఉన్న 17వ శతాబ్దానికి చెందిన నిజాం కాలం నాటి మెట్ల బావి బన్సీలాల్‌పేట పునరుద్ధరణ జనవరి 2022లో పూర్తయింది. దీనిని ఆగస్టు 15న ప్రారంభించనున్నారు. ఈ మెట్ల బావి దశాబ్దాల తరబడి చెత్తాచెదారంతో నిండి ఉండేది.

నారాయణపేట మెట్లబావి పునరుద్ధరణ:

హైదరాబాద్‌కు దూరంగా, నారాయణపేటలోని బారం బావి మెట్లబావిని కూడా రెయిన్‌వాటర్ ప్రాజెక్ట్ పునరుద్ధరించింది. మెట్ల బావిని పునరుద్ధరించినందుకు పలువురు ప్రశంసించారు. స్థానిక మహిళలు బతుకమ్మను ఆ మెట్ల బావి చుట్టూ ప్రదర్శించారు.

నారాయణపేటలో దాదాపు 45కు పైగా మెట్ల బావులు ఉన్నాయి. "మేము దశల వారీ పునరుద్ధరణను లక్ష్యంగా పెట్టుకున్నాము" అని హరి చందన చెప్పారు. మొదటి దశలో భాగంగా ప్రాజెక్ట్ ఏకకాలంలో ఐదు-ఆరు మెట్ల బావులపై పని చేస్తోంది. స్థానిక పరిపాలన, హైదరాబాద్ డిజైన్ ఫోరమ్ భాగస్వామ్యంతో ప్రారంభించబడిన ఈ ప్రాజెక్ట్, పాత స్టెప్‌వెల్‌లను డాక్యుమెంట్ చేయడం, వాటిని వెలుగులోకి తీసుకురావడం. వాటి ఉనికిని ప్రజలు, అధికారులకు తెలిసేలా లక్ష్యంగా పెట్టుకున్నారు.

ది రెయిన్‌వాటర్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లో పురాతన మెట్ల బావులను విజయవంతంగా పునరుద్ధరించింది వీటినే:

1. కోకాపేట్ మెట్ల బావి

2. బన్సీలాల్ పేట్ మెట్ల బావి

3. గచ్చిబౌలి మెట్ల బావి

4. కొండాపూర్ స్టెప్ వెల్

5. రెండు గోశాల మెట్ల బావులు

INK@WASH 3.0 (Innovations & New Knowledge in Water, Sanitation and Hygiene) లో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీలలో The Rainwater Project కూడా ఒకటి. INK@WASH 3.0 హైదరాబాద్ లో మే 2022లో నిర్వహించనున్నారు. INK@WASH తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD), డిపార్ట్‌మెంట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. స్టార్టప్‌లు/ఆవిష్కర్తలు, సలహాదారులు, విద్యాసంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలకు నిధులు సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

Next Story