Hyderabad: ఆ యువకుడి చేష్టలతో పోలీసులకే దిమ్మతిరిగిందిగా!
మద్యం సేవిస్తూ జల్సా చేయడం కోసం పోలీసులను, కన్నతండ్రిని బురిడీ కొట్టించాడు ఓ సుపుత్రుడు. తన కొడుకు కనిపించడం లేదంటూ
By అంజి Published on 11 July 2023 9:53 AM ISTHyderabad: ఆ యువకుడి చేష్టలతో పోలీసులకే దిమ్మతిరిగిందిగా!
హైదరాబాద్: మద్యం సేవిస్తూ జల్సా చేయడం కోసం పోలీసులను, కన్నతండ్రిని బురిడీ కొట్టించాడు ఓ సుపుత్రుడు. తన కొడుకు కనిపించడం లేదంటూ ఓ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఫిలింనగర్ పోలీసులు రంగంలోకి దిగారు. యువకుడి కోసం ఉరుకులు పరుగులు పెట్టారు. తీరా పోలీసులు లొకేషన్ తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతంలో ఉన్న వారిని చూసేసరికి పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ సుపుత్రుడు స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ జల్సా చేయడానికి చేసిన తతంగమని పోలీసులకు అర్థమైంది.
హైదరాబాదు నగరంలోని షేక్పేట్‌కు చెందిన షోయబ్ అనే యువకుడు నాలుగు రోజుల క్రితం స్నేహితులతో గొడవ జరిగిందని తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం ఆదివారం షోయబ్ ఇంటికి రాకపోవడంతో తండ్రి కంగారుపడ్డాడు. అనంతరం తండ్రి కొడుకుకు ఫోన్ చేశాడు. ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ రావడంతో కంగారు పడిన తండ్రి.. షోయబ్ స్నేహితుడు హమీద్ పైన అనుమానపడ్డాడు. స్నేహితుడు హమీదే షోయబ్‌ని ఏమైనా చేసి ఉంటాడని భయపడి తండ్రి వెంటనే 100కు డయల్ చేసి తన కుమారుడు కిడ్నాప్‌కు గురయ్యాడని తెలిపాడు. సమాచారం అందుకున్న వెంటనే ఫిలింనగర్ పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రంగంలోకి దిగిన పోలీస్ బృందం షోయబ్ కోసం దాదాపు రెండు గంటల పాటు విస్తృతంగా గాలించారు. అనంతరం పోలీసులు రెండు గంటల పాటు శ్రమించి షోయబ్ వద్ద ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంతో నగర శివారు ప్రాంతాల్లో ఉన్నట్లుగా తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి పోలీసులు చూడగా షోయబ్ తన స్నేహితుడు హమీద్‌తో కలిసి మద్యం తాగుతూ జల్సా చేయడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. గొడవ అనంతరం ఇద్దరు స్నేహితులు తిరిగి కలిసినందుకు మద్యం పార్టీ చేసుకున్నట్లుగా వారు పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత పోలీసులు ఆ సుపుత్రుడిని పట్టుకొని తండ్రికి అప్పగించారు.