మాదాపూర్ డ్రగ్స్‌ కేసు.. నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి.. టాలీవుడ్‌లో గుబులు

మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ఫైనాన్షియర్‌ వెంకట్ రత్నారెడ్డి బాలాజీ మురళిలను పోలీసులు విచారించనున్నారు.

By అంజి  Published on  13 Sep 2023 5:57 AM GMT
accused custody, Madapur drug case, Hyderabad

మాదాపూర్ డ్రగ్స్‌ కేసు.. నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి.. టాలీవుడ్‌లో గుబులు

హైదరాబాద్‌: మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతించింది. సినీ డైరెక్టర్ వెంకటరత్నారెడ్డి అలియాస్ వెంకట్ గత కొన్ని రోజుల క్రితం మాదాపూర్‌లోని ఒక అపార్ట్మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ పార్టీ నిర్వహించాడు. విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే పోలీసులు దాడులు చేసి సినీ నిర్మాత వెంకట్ తో పాటు బాలాజీ, మురళి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ముగ్గురి గురించి పోలీసులు ఆరా తీయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి నేరాలు - మోసాలు ఒక్కొక్కటిగా బయటికి రావడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు.

సినీ నిర్మాత వెంకట్, బాలాజీ గోవా, బెంగళూరు వెళ్లి ఒక నైజీరియన్ వద్ద నుండి డ్రగ్స్ కొనుగోలు చేసుకుని హైదరాబాద్‌కు తీసుకువచ్చి అవసరమైన వినియోగదారులకు విక్రయాలు జరుపుతున్నాడు. ఈ ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించిన గుడిమల్కాపూర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపి నిందితులను నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది. ఇప్పటికే వెంకట్ నుండి 18 మంది ఇండస్ట్రీ బిజినెస్ వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. తమ పేర్లు బయటికి రావడంతో కస్టమర్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. వెంకట్ తన కస్టమర్లతో కేవలం స్నాప్ చాట్‌లో మాత్రమే చాట్ చేశానంటూ చెబుతున్నాడు.

వెంకట్ అరెస్ట్ అయిన తర్వాత తమ స్నాప్ చాట్ అకౌంట్ ను కస్టమర్లు డిలీట్ చేశారు. వెంకట్ అరెస్ట్ జరగడంతో 18 మంది డ్రగ్స్ కస్టమర్స్ హైదరాబాద్ వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఈరోజు నుండి నాలుగు రోజులపాటు ఫైనాన్షియర్‌ వెంకట్ రత్నారెడ్డి బాలాజీ మురళిలను పోలీసులు విచారించనున్నారు. మరికాసేపట్లో పోలీసులు ఈ ముగ్గురు నిందితులను చంచలగూడ జైలు నుండి హెచ్ న్యూ కార్యాలయానికి తరలించనున్నారు. కోర్టు ఇచ్చిన అనుమతితో పోలీసులు బాలాజీ, వెంకటరత్నారెడ్డి, మురళి లను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ ఎక్కడినుండి తీసుకు వచ్చారు? హైదరాబాదు నగరంలో ఎవరెవరికి విక్రయించారు? వెంకట్ ఇచ్చిన పార్టీలో ఎవరెవరు పాల్గొనేవారు? అనే కోణంలో నిందితులను విచారించనున్నారు. సినీ రంగానికి చెందినవారు డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో సినీ పరిశ్రమలో హల్చల్ రేగుతుంది. పలువురు సినీ నటుల్లో గుబులు పుట్టుకస్తోంది.

Next Story