మళ్లీ తెరుచుకున్న 'తారకరామ' థియేటర్..!
'Tharakarama' theater reopened. హైదరాబాద్ కాచిగూడలోని 'తారకరామ' థియేటర్ మళ్లీ తెరుచుకుంది.
By M.S.R Published on 14 Dec 2022 3:15 PM GMTహైదరాబాద్ కాచిగూడలోని 'తారకరామ' థియేటర్ మళ్లీ తెరుచుకుంది. నందమూరి బాలకృష్ణ ఈ థియేటర్‌ను పునః ప్రారంభించారు. నారాయణ్ కె దాస్ నారంగ్ కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ నందమూరి తారక రామారావు గారిపై ఉన్న అభిమానంతో 'ఏషియన్ తారకరామ' థియేటర్‌ని రెనోవేట్ చేశారు. 'ఏషియన్ తారకరామ' థియేటర్ రీ-ఓపెన్ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, ప్రొడ్యూసర్ శిరీష్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. 'తెలుగువారి స్ఫూర్తి ప్రదాత తారకరామారావు గారు. చిత్ర పరిశ్రమ మద్రాస్ లో వున్నప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ ఎస్టేట్ ప్రారంభించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రస్థానం మొదలుపెట్టారు. ఇక్కడ ఎన్టీఆర్ ఎస్టేట్ కూడా ఒక పర్యటక స్థలంగా వుండేది. అలాగే ఈ తారకరామ థియేటర్ వుండేది. ఈ థియేటర్ కి ఒక చరిత్ర వుంది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మా అమ్మగారి జ్ఞాపకార్ధం కట్టిన ఓ దేవాలయం. తారకరామ థియేటర్ కూడా అమ్మ నాన్నగారి పేర్లు కలిసివచ్చేటట్లు కట్టిన దేవాలయం. 1978లో అక్బర్ సలీం అనర్కాలితో ఈ థియేటర్ ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 95లో కొన్ని అనివార్యకారణాల వలన మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఇది మూడోసారి. ఈ థియేటర్ కి గొప్ప చరిత్ర వుంది. డాన్ సినిమా ఇక్కడ 525రోజులు ఆడింది. అలాగే నా సినిమాలు మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, అనసూయమ్మగారి అల్లుడు, ఇలా అన్నీ సినిమాలు అద్భుతంగా ఆడాయి. అలాగే మా అబ్బాయి మోక్షజ్ఞ తారకరామ తేజ పేరు కూడా ఈ థియేటర్ లోనే నాన్న గారు నామకరణం చేశారు. నారాయణ్ కె దాస్ నారంగ్ గారికి నాన్నగారి సన్నిహిత సంబంధాలు ఉండేవి. వాళ్ళ అబ్బాయి సునీల్ నారంగ్ ఆ పరంపరని ముందుకు తీసుకువెళ్తున్నారు. మేమంతా ఒక కుటుంబ సభ్యులం. వారి పర్యవేక్షణలో ఈ థియేటర్ నడపడం చాలా సంతోషంగా వుంది. ఈ అనుబంధం ఇలానే కొనసాగించాలి.' అని అన్నారు.