టీ20 మ్యాచ్ టికెట్లు.. జింఖానా గ్రౌండ్స్‌ వ‌ద్ద ఉద్రిక్త‌త‌.. పోలీసుల లాఠీచార్జ్‌..!

Tension at Gymkhana Grounds Police baton charge.హైద‌రాబాద్ న‌గ‌రంలోని జింఖానా గ్రౌండ్స్ వ‌ద్ద ఉద్రిక‌త్త నెల‌కొంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2022 7:42 AM GMT
టీ20 మ్యాచ్ టికెట్లు.. జింఖానా గ్రౌండ్స్‌ వ‌ద్ద ఉద్రిక్త‌త‌.. పోలీసుల లాఠీచార్జ్‌..!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని జింఖానా గ్రౌండ్స్ వ‌ద్ద ఉద్రిక‌త్త నెల‌కొంది. ఆదివారం భార‌త్‌-ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ఉప్ప‌ల్ వేదిక‌గా మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను గురువారం ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు జింఖానా మైదానంలో విక్ర‌యించ‌న‌ట్లు హెచ్‌సీఏ ప్ర‌క‌టించింది. దీంతో టికెట్ల కోసం అభిమానులు అర్థ‌రాత్రి నుంచే క్యూలైన‌ల్లో బారులు తీరారు.

టికెట్ల విక్ర‌యం కోసం ప్యార‌డైజ్ కూడ‌లి నుంచి జింఖానా వ‌ర‌కు క్యూ లైన్‌ను ఏర్పాటు చేశారు. అయితే.. అంచ‌నాల‌కు మించి అభిమానులు రావ‌డంతో వాళ్ల‌ను నియంత్రించ‌డం పోలీసుల‌కు క‌ష్ట‌త‌ర‌మైంది. ప్ర‌ధాన గేటు నుంచి అభిమానులు ఒక్క‌సారిగా తోసుకుని రావ‌డంతో ప‌రిస్థితి అదుపు త‌ప్పింది. టికెట్ల కోసం ఎగ‌బ‌డ‌డంతో గ్రౌండ్ వ‌ద్ద తొక్కిస‌లాట జ‌రిగింది. ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకురావ‌డానికి పోలీసులు లాఠీల‌కు ప‌ని చెప్పారు.


ఈ ఘ‌ట‌న‌లో 20 మందికి పైగా సృహ తప్పిపోయారు. కొంద‌రు అభిమానుల‌తో పాటు 10 మందికి పైగా పోలీసుల‌కు గాయాలు అయ్యాయి. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. టికెట్ల విక్రయానికి సంబంధించి ఆది నుంచి తీవ్ర గందరగోళం కొనసాగింది. మ్యాచ్‌ తేదీ సమీపిస్తున్నప్పటికీ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ అంటూ హెచ్‌సీఏ సాగదీసింది. హెచ్‌సీఏ తీరుపై అభిమానులు నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డంతో గురువారం విక్ర‌యించనున్న‌ట్లు తెలిపింది.

Next Story