ట్యాంక్ బండ్‌లోనే నిమజ్జనం చేస్తాం: పీవోపీ గణపతుల నిర్వాహకులు

ట్యాంక్ బండ్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

By అంజి  Published on  26 Sept 2023 7:11 AM IST
immersion, Ganesh idols, tank bund, Hyderabad

ట్యాంక్ బండ్‌లోనే నిమజ్జనం చేస్తాం: పీవోపీ గణపతుల నిర్వాహకులు

హైదరాబాద్‌: హుస్సేన్ సాగర్‌లో పీవోపీ గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలను ఖండిస్తూ ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ గణపతి ఆర్గనైజర్లు, కమిటీ సభ్యులు అందరూ కలిసి ట్యాంక్‌ బండ్‌ రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోవడం, పోలీసులు జోక్యం చేసుకోవడంతో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీ వాంట్‌ జస్టిస్‌ అంటూ పీవోపీ గణపతుల నిమజ్జనాలను హైకోర్టు అనుమతించాలని డిమాండ్ చేశారు. 70 ఏళ్లుగా ట్యాంక్ బండ్‌లో గణేష్ నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని, గత సంవత్సరం నుండి ప్రభుత్వం నిమజ్జనంపై ఇబ్బందులు పెడుతుందోని అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ట్యాంక్ బండ్‌లో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామని గణేష్ మండప నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులు పెద్ద ఎత్తున చేరుకొని ధర్నా చేయడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే అప్రమత్తమై ట్యాంక్ బండ్‌లో విగ్రహాలు వేసేందుకు అనుమతి ఇవ్వడంతో భాగ్యనగర్ ఉత్సవ సమితి, వీహెచ్‌పీ సభ్యులు ట్యాంక్ బండ్‌పై ఆందోళన విరమించారు. దీంతో పోలీసులు వెంటనే ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ క్లియర్ చేశారు. ట్యాంక్ బండ్ పై యధావిధిగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ట్యాంక్ బండ్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని చెప్పింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి కృత్రిమ కొలనులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Next Story