నాగార్జున నుంచి పదేళ్ల అద్దె వసూలు చేయాలి: సీపీఐ నారాయణ
హైడ్రా ఏర్పాటు మంచి పరిణామమని సీపీఐ నారాయణ అన్నారు. గత ప్రభుత్వం చేయనిది ఇప్పుడు రేవంత్ చేస్తున్నారని అన్నారు.
By అంజి Published on 25 Aug 2024 7:15 PM ISTనాగార్జున నుంచి పదేళ్ల అద్దె వసూలు చేయాలి: సీపీఐ నారాయణ
హైడ్రా ఏర్పాటు మంచి పరిణామమని సీపీఐ నారాయణ అన్నారు. గత ప్రభుత్వం చేయనిది ఇప్పుడు రేవంత్ చేస్తున్నారని అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డికి చెందిన అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయాలన్నారు. నాగార్జున బిగ్‌బాస్‌కే బిగ్‌బాస్‌లా మారరని అన్నారు. దొంగ పట్టాలు సృష్టించి చెరువు కబ్జా చేశారని ఆరోపించారు. ఆయన నుంచి పదేళ్ల అద్దె వసూలు చేయాలని వ్యాఖ్యానించారు. నిన్న నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే.
దీనిపై సీపీఐ నారాయణ మాట్లాడారు. నాగార్జున 'ఎన్ కన్వెన్షన్' లో సంపాదించిన డబ్బును కక్కించాలన్నారు. హైడ్రా కూల్చివేతలను తాము స్వాగతిస్తున్నామని, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువులు కుంటలు కాలువలను బడా బాబులు కబ్జా చేసి కట్టడాలు నిర్వహించారని అన్నారు. పాడు భూములు, చెరువులు ట్యాంకులు ఇంజనీరింగ్ కాలేజ్ లు, ఫంక్షన్ హాల్ అక్రమ నిర్మాణాలు చేపట్టారని, గతంలో తాము ఎన్నో పోరాటాలు చేశామని, అయినా అప్పటి ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు.
''చెరువులు, కుంటలు నాళాలు ఖాళీ చేసేందుకు హైడ్రా ఏర్పాటు చేశారు. ఎన్ కన్వెన్షన్ అధినేత నాగార్జున.. బిగ్ బాస్ కే బాస్.. నాగార్జున సినిమా యాక్టర్ కావచ్చు. సినిమాల నటించడంతోపాటు బిగ్ బాస్ లోనే వందల కోట్ల వస్తాయి. నాగార్జునకు ఎందుకు అంత కక్కుర్తి ..చెరువు ఎఫ్ టి ఎల్ లో ఫంక్షన్ హాల్ కట్టడం ఏంటి?. చెరువును ఆక్రమించి నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ లో సంపాదించిన డబ్బును కక్కించాలి. నష్టపరహారం కూడా కట్టించాలి..అలా వచ్చిన డబ్బులతో పేదవారికి ఇల్లు కట్టించాలి'' అని సీపీఐ నారాయణ అన్నారు.
''మాజీమంత్రి మల్లారెడ్డి కూడా కబ్జాకోరు ఆయనతో పాటు మరి కొంతమంది కబ్జా కొరులు ఉన్నారు. పైకి రాజకీయ నాయకులుగా నటిస్తూ లోపల కబ్జాలకు పాల్పడుతున్నారు. హైదరాబాదులో నాళాలు చెరువుల కుంటలు, కబ్జాలు కావడంతో పదినిమిషాలు వర్షం పడితే నగరం నరకంగా మారుతోంది. మధ్యతరగతి పేదవారు నోటరీ భూముల్లో ఇల్లు కట్టుకున్నారు. అలాంటి వారికి రెగ్యులర్ చేయండి.. కానీ అలాంటి వారి పొట్ట కొట్టమాకండి. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టవద్దు. పారదర్శకంగా వ్యవహారించాలి. ఏ పార్టీ వారైన అక్రమ నిర్మాణం చేపట్టిన కూల్చివేయాలని'' అని అన్నారు.