ఎన్నికల్లో గెలవడం..యూపీఎస్సీ పరీక్ష రాయడం కన్నా కఠినం: కేటీఆర్

రాజకీయాలు, ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసినదానికంటే కఠినమైన పని అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

By Srikanth Gundamalla  Published on  12 Aug 2023 2:01 AM GMT
Telangana, Minister KTR,  Politics, Hyderabad,

ఎన్నికల్లో గెలవడం..యూపీఎస్సీ పరీక్ష రాయడం కన్నా కఠినం: కేటీఆర్

రాజకీయాలు, ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసినదానికంటే కఠినమైన పని అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌ మొహాలీలోని ఇండియన్ స్కూల్‌ ఆఫ్ బిజినెస్‌లో 'అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం ఇన్‌ పబ్లిక్‌ పాలసీ' కోర్సును ప్రారంభించిన తర్వాత.. ఈ తరహా వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్.

రాజకీయ కుటుంబం నుంచి వచ్చినందుకు తనకు తెలంగాణ ఉద్యమంలో క్షేత్రస్థాయిలో పని చేసేందుకు అవకాశం దొరికిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎవరైనా సరే జీవితంలో గొప్ప విజయాలు సాధించాలంటే కష్టపడాలి.. త్యాగాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇందుకు రాజకీయ నాయకులు కూడా అతీతం కాదని పేర్కొన్నారు కేటీఆర్. రాజకీయాలను వృత్తిగా ఎంచుకుంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. అయితే.. రాజకీయాల్లోకి విభిన్న రంగాల్లో నైపుణ్యం ఉన్నవారు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చే యువత క్షేత్రస్థాయిలో పని చేసి వస్తే గొప్ప విజయాలను సాధించే అవకాశం ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు రుణాలను భవిష్యత్‌కు పెట్టుబడిగా చూపిస్తున్నాయని అన్నారు. కానీ.. మన దేశంలో మాత్రం రుణాల విషయంలో అనేక అపోహలు ఉన్నాయని చెప్పారు కేటీఆర్. నేటి యువత ఉద్యోగం రాగానే రుణాలు తీసుకుని జీవితాలను బాగు చేసుకుంటోంది. అలాగే.. దేశాలు కూడా మౌలిక వసతుల కోసం అవసరమైతే రుణాలు తీసుకుని భవిష్యత్‌కు పెట్టుబడిగా భావించాలని కేటీఆర్ అన్నారు. వినూత్న పరిపాలన విధానాలు భారత్‌కు అవసరమని మంత్రి కేటీఆర్ అన్నారు.

కేంద్రం సాయం చేయకున్నా తెలంగాణలో ఎన్నో పనులను చేపట్టామని.. అవి పూర్తి కూడా చేశామని అన్నారు మంత్రికేటీఆర్. ఎన్నో సవాళ్లను దాటుకుని లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టుని నాలుగేళ్లలో పూర్తి చేశామని తెలిపారు. గతంలో ఏ రాష్ట్రం సాధించిన విధంగా అతి తక్కువ సమయంలో తెలంగాణ అనేక విజయాలను అందుకుందని అన్నారు. ఎనిమిదేళ్లలో తలసరి ఆదాయం, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి భారీగా పెరగడం తెలంగాణ అభివృద్ధికి సాక్ష్యమన్నారు. దేశంలో అత్యధిక ఐటీ ఉద్యోగాలు అందిస్తున్న అతిపెద్ద నగరం హైదరాబాద్‌ అని.. ఐటీ ఉద్యోగుల సంఖ్య 300 శాతం, ఎగుమతులు 400 శాతం పెరిగాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Next Story