హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. బుధవారం నాడు ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశించింది. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలు తొలగించామని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని, దాని ప్రకారం ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ తెలిపారు.
చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని, చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో విధించిన 'స్టేటస్ కో' కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. దీంతో మే 15 వరకు ఆ భూముల్లో ప్రభుత్వం ఎలాంటి పనులు చేసేందుకు వీలు లేకుండా పోయింది. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేది లేదని కోర్టు స్పష్టం చేసింది. సీఎస్‌ను కాపాడాలనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని స్పష్టం చేసింది.