వీధి కుక్కల దాడి ఘటన.. స్పందించిన గవర్నర్‌ తమిళిసై

వీధికుక్కల దాడితో బాలుడు మృతి చెందిన ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

By అంజి  Published on  22 Feb 2023 2:49 PM IST
MinisterKTR,Stray dogs,Tamilisai Soundararajan, Hyderabad

వీధి కుక్కల దాడి ఘటనపై గవర్నర్‌ స్పందన

హైదరాబాద్: వీధికుక్కల దాడితో ఐదేళ్ల బాలుడు మృతి చెందడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం స్పందిస్తూ.. ఈ ఘటనతో 'ప్రస్తుత ఏర్పాట్లు సరిపోవడం లేదని రుజువవుతున్నందున వీధి కుక్కల బెడద పట్ల యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని' అన్నారు. ఈ ఘటనపై ఆమె విచారం కూడా వ్యక్తం చేశారు.

''ఈ విచారకరమైన సంఘటనను చూసి బాధపడ్డాను. ఇలాంటి బాధాకరమైన సంఘటనలు మాత్రమే శాశ్వత పరిష్కారాల అవసరాన్ని మనకు గుర్తు చేయకూడదు. పరిపాలన కొన్ని చురుకైన చర్యలు తీసుకోవాలి. ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఇప్పటికే ఉన్న ఏర్పాట్లు సరిపోవడం లేదని ఈ సంఘటన రుజువు చేస్తుంది. నో వర్డ్స్‌ టూ కన్సోల్'' అంటూ గవర్నర్‌ ట్వీట్ చేశారు.

అంబర్‌పేట మండలంలో ఆదివారం జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న తన తండ్రి గంగాధర్‌తో పాటు ప్రదీప్ అనే బాలుడు వెళ్లాడు. సంఘటన గురించి గంగాధర్ వివరిస్తూ.. ఆదివారం తనతో పాటు తన కొడుకు కూడా పనికి వచ్చాడని, బయట తిరుగుతుండగా వీధికుక్కలు తనపై దాడి చేశాయని తెలిపారు.

కొంతమంది స్థానికులు ప్రదీప్‌ను రక్షించడానికి, గంగాధర్‌తో కలిసి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి వచ్చేలోపే బాలుడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ మంగళవారం అన్నారు. ''మేము మా మున్సిపాలిటీలలో వీధి కుక్కల బెడదను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. మేము జంతు సంరక్షణ కేంద్రాలు, జంతు జనన నియంత్రణ కేంద్రాలను సృష్టించాము. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాము'' అని కేటీఆర్ తెలిపారు.

గతంలోనూ ఇదే తరహా ఘటనలో నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌ భవనంలో ఓ చిన్నారిని వీధికుక్క చంపేసింది. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది.

Next Story