GHMC విస్తరణ ప్రక్రియ పూర్తి..27 మున్సిపాలిటీలు విలీనంపై నోటిఫికేషన్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తరణ ప్రక్రియ పూర్తయింది
By - Knakam Karthik |
GHMC విస్తరణ ప్రక్రియ పూర్తి..27 మున్సిపాలిటీలు విలీనంపై నోటిఫికేషన్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విస్తరణ ప్రక్రియ పూర్తయింది. గ్రేటర్ హైదరాబాద్ శివారులోని పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయానికి జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆమోదం తెలిపారు. దీంతో హైదరాబాద్ నగర పరిధిలోని మొత్తం 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతలను డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు అప్పగించింది.
అలా ఏర్పాటై..ఇలా విలీనమై
హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీల విలీనంతో 1955లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్)ను ఏర్పాటు చేశారు. తరువాత మెదక్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఉప్పల్, ఎల్బీనగర్, గడ్డి అన్నారం, మల్కాజిగిరి, కాప్రా, అల్వాల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, రామచంద్రాపురం, రాజేంద్రనగర్ మున్సిపాలిటీలను, పలు గ్రామాలను ఎంసీహెచ్‌లో విలీనం చేశారు.
అలా విలీనం చేసి 2007లో జీహెచ్ఎంసీని ఏర్పాటు చేశారు. విలీన ప్రకటన విడుదలవగానే ఎంసీహెచ్ అధికారులు ఆయా మున్సిపాలిటీల్లోని ఇంజినీరింగ్ పనులు, నిధులకు సంబంధించిన రికార్డులు, చెక్కులు, ఆస్తి పన్ను దస్త్రాలు, ఇతర పత్రాలు అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. 2 నెలల పాటు ఆయా మున్సిపాలిటీల అధికారులే ఎప్పటిలాగే పౌరులకు సేవలు అందించారు. అప్పటివరకు ఎంసీహెచ్ పరిధికి ఓ కమిషనర్, 7 సర్కిళ్లకు ఏడుగురు ఉప కమిషనర్లు ఉండేవాళ్లు. విలీనం అనంతరం 12 మున్సిపాలిటీలను, 7 సర్కిళ్లను కలిపి 18 సర్కిళ్లుగా కలిపారు. వాటిపై పర్యవేక్షణకు 5 జోన్లు ఏర్పాటు చేశారు. తరువాత జోన్లు ఆరుకు, సర్కిళ్లు 30కి పెరిగాయి. అలా నగర విస్తీర్ణం 172 చదరపు కిలోమీటర్ల నుంచి 650 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.