సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ పండుగ జరగనుంది. ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. బోనాల సందర్భంగా ఉదయం నుంచే భక్తులతో అమ్మవారి దేవాలయం కిటకిటలాడుతోంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ బాగా ఏర్పడింది. పలువురు వీవీఐలు అమ్మవారి దర్శనం కోసం వస్తుండటంతో.. పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఆలయ సిబ్బంది కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తదితరులు ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత మహాకాళిని దర్శించుకొని బంగారు బోనం సమర్పించారు.
ఇదిలావుంటే.. మహాకాళి అమ్మవారి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రభుత్వం ప్రతిఏటా వైభవంగా నిర్వహిస్తోంది. ఆషాఢమాసంలో గ్రామదేవతలను పూజిస్తూ.. ప్రారంభమయ్యే ఈ బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం. బోనాల వేడుకల్లో ప్రధాన ఘట్టమైన రంగం సోమవారం జరగనుంది. అవివాహిత జోగిని ఈ భవిష్యవాణి చెప్పనున్నారు. ఈ సంవత్సరం తెలంగాణకు ఎలా ఉంటుందో చెబుతారనే ఆసక్తి భక్తులలో నెలకొని ఉంటుంది. ఈ రంగంలో గజరాజుపై అమ్మవారి ఊరేగింపు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.