తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఇస్తూ వస్తోంది. పలువురు ప్రముఖులు, ముస్లిం నేతలు ఇఫ్తార్ విందులో పాల్గొంటూ ఉంటారు. ఈసారి కూడా ఇఫ్తార్ విందుపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 12వ తేదీన ఇఫ్తార్ విందును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరం ఇఫ్తార్ విందుకు ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నాడు ఎల్‌బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంమంత్రి మహాముద్ అలీతో కలిసి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
ముస్లిం మత పెద్దల సమక్షంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఈ ఇఫ్తార్ విందును తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మంది నిరుపేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీ చేయనున్నారు.