మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్ మేళాలకు వేదికయింది. కరోనా భయం తగ్గడంతో నగరవాసుల్ని అలరించడానికి ఎగ్జిబిషన్స్ వచ్చేశాయి. ఒకపక్క నుమాయిష్.. మరోపక్క హునర్ హాత్ మేళా కొలువుదీరాయి. నునాయిష్ లో అన్నిరకాల వస్తువులు లభిస్తుంటే.. హునర్ హాత్ మేళాలో హస్తకళాకృతులున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుంచి హస్తకళాకారులు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించడంతో పాటుగా అమ్మకానికి పెట్టారు. మనకు మాత్రమే ప్రత్యేకమన తోలుబొమ్మలు స్పెషల్ అట్రాక్షన్. 15వ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయల కాలంనుంచి ఉన్న తోలుబొమ్మల తయారీకి 2008లో భౌగోళిక గుర్తింపు వచ్చింది. తోలుబొమ్మలాటకు ఆదరణ తగ్గినా కాలానుగుణంగా ల్యాంప్ హెడ్స్, పెయింటింగ్స్, వాల్ ఆర్ట్స్ రూపొందిస్తున్నారు కళాకారులు.
దీంతోపాటుగా అస్సాం కళాకారులు రూపొందించిన వెదురు ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు లభిస్తున్నాయి. మరోవైపు కర్నాటక చెన్నపట్నం బొమ్మలు ఇక్కడ కొలువుదీరాయి. వీటికి భౌగోళిక గుర్తింపు రావడంతో ఆదరణ పెరగడంతోపాటుగా ట్రెండుకు తగ్గట్టుగా పాత, కొత్త బొమ్మల్ని తయారుచేస్తున్నారు కళాకారులు. ఇక విభిన్న రాష్ట్రాలకు చెందిన నోరూరించే చిరు తిండ్లు, ఆహార పదార్దాలు, స్వీట్స్ మనల్ని కదలకుండా చేస్తాయి. ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 6దాకా ఈ మేళా కొనసాగుతుంది. నైపుణ్యం, పనితనం, అందం ఉన్న ఈ ఉత్పత్తులన్నీ చేతితో తయారుచేసినవే. మిగితా ఉత్పత్తులతో పోలిస్తే ఆకర్షణీయంగా, అరుదుగా కనిపించడంతో పాటుగా తయారీకి ఓర్పు, సమయం ఎక్కువగా అవసరం అవసరం అంటున్నారు కళాకారులు.