హృదయవిదారకం.. నాలుగేళ్ల బాలుడిని చంపేసిన వీధికుక్కలు
Street Dogs killed four years old boy in Hyderabad.కుమారుడికి కాస్త ఆటవిడుపుగా ఉంటుందని బావించిన ఆ తండ్రి తన
By తోట వంశీ కుమార్ Published on 21 Feb 2023 8:05 AM ISTకుమారుడికి కాస్త ఆటవిడుపుగా ఉంటుందని బావించిన ఆ తండ్రి తన నాలుగేళ్ల కుమారుడిని తాను పని చేసే చోటుకి తీసుకువెళ్లాడు. తన కుమారుడికి అదే చివరి రోజు అవుతుందని ఆ తండ్రి ఊహించలేకపోయాడు. అతడు పనిలో నిమగ్నమై ఉండగా.. కొద్ది దూరంలో ఉన్న అక్క వద్దకు వెళ్లాలని ఆ చిన్నారి అనుకున్నాడు. అక్క వద్దకు వెలుతుండగా ఆ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు తన శక్తి మేర ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ పసివాడి బలం సరిపోలేదు. తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ ఉపాధి నిమిత్తం నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. భార్య, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌తో కలిసి బాగ్అంబర్‌పేట ఎరుకుల బస్తీలో ఉంటూ.. అంబర్‌పేట ఛే నంబర్ చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.
ఆదివారం సెలవు కావడంతో తన పిల్లలను గంగాధర్ సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళ్లాడు. కూతురిని పార్కింగ్ ప్రదేశం వద్ద క్యాబిన్‌లో ఉంచాడు. కొడుకును తీసుకుని సర్వీస్ సెంటర్ లోపలికి వెళ్లాడు. అక్కడ కుమారుడు ఆడుకుంటుండగా మరో వ్యక్తితో కలిసి గంగాధర్ పని మీద మరో ప్రదేశానికి వెళ్లాడు. కొద్ది సేపు అక్కడ ఆడుకున్న ప్రదీప్.. తన అక్క వద్దకు వెళ్లాలని అనుకున్నాడు.
అక్క వద్దకు నడుచుకుంటూ ప్రదీప్ వెలుతుండగా.. వీధి కుక్కులు అతడి వెంటపడ్డాయి. బాలుడు భయంతో అటూ ఇటు పరుగులు తీశాడు. అయినప్పటికీ అవి అతడిని వదలలేవు. ఒకదాని తరువాత మరొకటి ఆ బాలుడిపై దాడి చేశాయి. ఓ కుక్క కాలు, మరో కుక్క చేయి నోటకరచుకుని ఒకే సారి లాగడంతో ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రదీప్ అరుపులు విన్న అక్క.. అక్కడికి వచ్చి చూసింది. వెంటనే పరుగున తండ్రి వద్దకు వెళ్లి చెప్పింది. గంగాధర్ వచ్చి కుక్కలను అక్కడి నుంచి తరిమికొట్టాడు. తీవ్రగాయాలు అయిన ప్రదీప్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అయితే.. అప్పటికే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.