కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ఇంటిపై బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడిచేశారు. అంబర్‌పేటలోని వీహెచ్ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వీహెచ్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సమస్యలు ఉన్నాయంటే వాటి పరిష్కారానికి తాను ముందుంటానన్నారు. కారును ధ్వంసం చేసినవారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే అని చెప్పారు.
మాజీ పీసీసీ అధ్యక్షుడిగా, మాజీ ఎంపీగా పని చేసిన తనకు రక్షణ లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదా అని నిలదీశారు. గతంలో తనకు బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు డీజీపీకి విన్నవించుకున్నా.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారును ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. దాడి జరిగిన సమయంలో వీహెచ్ ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ దాడిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇక వీహెచ్ ఇంటిపై దాడి జరిగిందని తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు.