స్టాండ్-అప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ ఆగస్టు 20న హైదరాబాద్‌లో ప్రదర్శన ఇవ్వబోతున్నారు. మునావర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం "డోంగ్రీ టు నోవేర్" పేరుతో తన ప్రదర్శన ఉందని ప్రకటించాడు. ఈ విషయమై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. ఆ కార్యక్రమం నిర్వహిస్తే వేదికకు నిప్పు పెడతామని, మునావర్ ఫరూఖీపై "దాడి" చేస్తామని బెదిరించారు. అలాగే దీనికి తెలంగాణ సర్కార్ అనుమతిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరిణామాలు వేరేలా ఉంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మునావర్.. గతంలో హిందూ దేవుళ్లపై జోకులు వేశారని, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ప్రదర్శనకు ఆహ్వానిస్తే ఏం జరుగుతుందో చూస్తారు. ఎక్కడ కార్యక్రమం జరిగినా దాడి చేస్తామని రాజాసింగ్ అన్నారు. ఆగస్ట్ 20న హైదరాబాద్‌లో డోంగ్రీ టూ నోవేర్ షో ఉందని, రూ.499 రూపాయలకు ఈ టిక్కెట్లను BookMyShowలో విక్రయిస్తున్నారని మునావర్ తెలిపాడు. ఈ ఏడాది జనవరి 9న హైదరాబాద్‌లో తన 'దందో' షోను మునావర్ ప్రదర్శించాల్సి ఉంది. అయితే కోవిడ్ -19 కేసుల పెరుగుదల కారణంగా అది రద్దు అయింది.
అప్పుడు కమెడియన్ మునావర్‌కు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ బహిరంగంగా ఆహ్వానం పలికారు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ అతడి ప్రదర్శనను అనుమతించబోమని ప్రకటించింది. మునావర్ కార్యక్రమాన్ని ఎలాగైనా ఆపాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ యువతకు పిలుపునిచ్చారు. హిందువులపై విద్వేషం సృష్టించేందుకే మునావర్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వవద్దని రాజాసింగ్ డీజీపీకి లేఖ రాశారు. ఏక్తా కపూర్ నిర్వహించిన క్యాఫ్టివ్ రియాలిటీ షో లాక్ అప్ లో మునావర్ విజేతగా నిలిచారు.