జరిమానాల్లో దక్షిణ మధ్య రైల్వే రికార్డ్..రూ.223 కోట్లు వసూలు, ఖజానా ఫుల్

దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టికెట్ తనిఖీల ద్వారా సరికొత్త రికార్డును సృష్టించింది

By -  Knakam Karthik
Published on : 21 March 2026 7:54 PM IST

Hyderabad News, Indian Railways, South Central Railway, TicketChecking , Secunderabad, RailwayRevenue

జరిమానాల్లో దక్షిణ మధ్య రైల్వే రికార్డ్..రూ.223 కోట్లు వసూలు, ఖజానా ఫుల్

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టికెట్ తనిఖీల ద్వారా సరికొత్త రికార్డును సృష్టించింది. రైల్వే బోర్డు నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని మరో 14 రోజుల ముందే చేరుకోవడమే కాకుండా, ఏకంగా రూ.223.60 కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించి రవాణా రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంది. సికింద్రాబాద్, విజయవాడ, హైదరాబాద్, గుంతకల్, గుంటూరు మరియు నాందేడ్ వంటి ఆరు కీలక డివిజన్లలో అధికారులు నిర్వహించిన నిరంతర మరియు కఠినమైన తనిఖీలే ఈ అసాధారణ వసూళ్లకు ప్రధాన కారణం.

ముఖ్యంగా టికెట్ లేకుండా ప్రయాణించే వారు, అక్రమంగా రిజర్వేషన్ కోచ్‌లలోకి ప్రవేశించే వారు మరియు నిబంధనలకు విరుద్ధంగా లగేజీని తీసుకెళ్లే వారిపై రైల్వే ప్రత్యేక నిఘా ఉంచింది. సాధారణ తనిఖీలతో పాటు పండుగలు, సెలవు దినాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్స్ ద్వారా జరిమానాల రూపంలో ఈ భారీ మొత్తం రైల్వే ఖజానాకు చేరింది.

గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం గణనీయంగా పెరగడం గమనార్హం. ప్రయాణికులు రైలు ప్రయాణ నిబంధనలను పాటించాలని, సరైన టికెట్ లేకుండా ప్రయాణించి జరిమానాలు మరియు చట్టపరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. లక్ష్యాన్ని ముందే చేరుకున్నప్పటికీ, రాబోయే వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.

Next Story