Hyderabad: భారత సైన్యానికి మద్ధతుగా.. నేడు భారీ సంఘీభావ ర్యాలీ
భారత సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
By అంజి
Hyderabad: భారత సైన్యానికి మద్ధతుగా.. నేడు భారీ సంఘీభవ ర్యాలీ
భారత సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే సైన్యానికి సంఘీభావంగా గురువారం హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం (8వ తేదీ) సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాలీ నిర్వహించనుంది. ఇందుకు తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం.. అధికారులతో చర్చించారు.
ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని భారత సైనిక బలగాలకు సంఘీభావంగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమయంలో ప్రతి పౌరుడు భారత సైనికులకు అండగా నిలబడాలని కోరారు. భారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రక్షణ రంగంలో వ్యూహాత్మకమైన హైదరాబాద్‌లో అవసరమైన అన్ని చోట్ల గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కార్యాలయాలు, రక్షణ రంగానికి చెందిన సంస్థలు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ''తెలంగాణకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలి. కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకుని పనిచేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలి'' అని సూచించారు.